సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖకు పేరు. విశాఖ ఎవరికైనా గమ్యం. ఎందరికో  కలల తీరం. జీవితంలో కాశీకి ఒక్కసారి అయినా వెళ్ళాలని ఆధ్యాత్మికపరులు అనుకుంటున్నారు. అలాగే జీవితంలో విశాఖను ఒకసారి అయినా సందర్శించాలని  పర్యాటకప్రేమికులు భావిస్తారు.  తపిస్తారు. వచ్చాక  అందాలను చూసి తరిస్తారు.

 

అటువంటి విశాఖను సరిగ్గా అయిదేళ్ళ క్రితం హుదూద్ తుఫాన్ రక్కసిగా మారి  భయపెట్టింది. విశాఖ సైతం శోకంలో  నిండా మునిగింది. విశాఖ అంటే తొలిసారి భయపడ్డారంతా. మళ్ళీ జనం వెంటనే తేరుకున్నారు. ఇపుడిపుడే విశాఖ బాగా అభివ్రుధ్ధి చెందుతోంది. రాజధాని రాజసం కూడా సంతరించుకుంది.

 

అటువంటి విశాఖలో కరోనా కేసు నమోదు అయింది. అదీ పాజిటివ్ గా వచ్చింది. దాంతో విశాఖ వాసుల గుండెల్లో కలవరం మొదలైంది. ఎక్కడో చైనాలో కరోనా వైరస్ అంటే ఏమో అనుకున్నారు. కానీ ఇంత తొందరగా విశాఖకు వచ్చేస్తుందని ఊహించలేదు. దాంతో కంగారు పడిపోతున్నారు. 

 

విశాఖలోని అల్లిపురానికి చెందిన 65 ఏళ్ళ వ్రుద్దుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఆయన మక్కా మసీద్ యాత్ర చేసి వచ్చారు. నెల రోజుల పాటు దేశం దాటి వచ్చారు. వచ్చాక కూడా అయన వారం రోజుల పాటు సిటీలో తిరిగారు. సడెన్ గా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడం పాజిటివ్ రిపోర్టులు రావడంతో విశాఖ షాక్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఒక్కరే కాదేమో, ఆయన ద్వారా ఎంతమందికి కరోనా వ్యాపిందేమో. 

 

దీంతో  విశాఖ వాసులు వణికిపోతున్నారు. ఎపుడు ఏం జరుగుతుందో, ఎవరికి కరోనా సోకుతుందోనని కంగారు పడుతున్నారు. ఆ వ్రుధ్ధుడితో విశాఖకు రైళ్ళో  వచ్చినవారు. ఆయనతో చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు, ఆయన తిరిగిన చోట కలసిన వారు అంతా ఇపుడు భయపడుతూ క్రుంగిపోతున్నారు. 

 

మొత్తానికి విశాఖలో కరోనా పడగ ఎత్తిందని తలచుకుని సాగరతీరంలో మరో మారు శోక గీతం మొదలైంది. నాటి హుదూద్ మాదిరిగానే విశాఖ జనాలు ఇపుడు ఇంటి గడప దాటడంలేదు. దాంతో ఎపుడూ రద్దీగా ఉండే రహదారులు ఒక్కస్దారిగా ఖాళీ అయిపోయాయి. కర్ఫ్యూ విశాఖకు ముందే వచ్చేసింది. మరి విశాఖకు కరోనా భయం లేకుండా, ఎవరికీ వ్యాపించకుండా ఉంటేనే నగరం మళ్ళీ వికసిస్తుంది. అంతవరకూ భయం భయం, బతుకు భయమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: