వేదాంతం చెబుతుంది అన్నీ అశాశ్వతాలే. అన్నీ తాత్కాలికాలే. ఏదీ మనది కాదు, అసలు మనమన్నది లేదు అని. నీవు అంటే ఎవరు అని ప్రశ్న వేసుకోమంటుంది. ఇవన్నీ వింటూ ఉంటే దైనందిన జీవితం సాగదు, ఏనాడో ఆగిపోతుంది. కానీ ఇపుడు తరుముకువస్తున్న కరోనా వైరస్ ని చూశాక అందరూ రాద్ధాంతాలు మానేశారు, వేదాంతమే శరణ్యమంటున్నారు.

 

ఎంత అనుకున్నా ఇంత తొందరగా జీవితం ముగిసిపోతుందని అంటే ఎవరికైనా భయమే. మరణం వస్తుందని అందరికీ తెలుసు. కానీ అది తెలియకుండా ఎపుడో వస్తేనే మ్యాజిక్. మరీ కరోనా రూపంలోనో  వస్తేనో, మరో దానికో బలి కమ్మంటే ఎవరూ సిధ్ధంగా ఉండరు సరికదా ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్న వేస్తారు.

 

దానికి సమాధానాలు ఉన్నాయి. ఇది పాపం లోకం. పాపులందరికీ తీసుకుపోయేందుకు దేవుడు కరోనాని ఈ భూమి మీదకు పంపించాడని. అపుడు మరో ప్రశ్న. పాపులు అందరూ అంటే నేను కాదుగా, నేను ఉత్తమమైన మానవుడిగా. నాకు ఈ కరోనా లాంటి వైరస్ లా బాధేంటి అని.  అయితే దుష్ట శిక్ష‌ణ చేసినపుడు మంచి వారు కూడా పోతూంటారు. అది అనివార్యం అన్న సమాధానం వస్తుంది.

 

ఇలా కరోనా వైరస్ గురించి ఎన్నో భయాలు, ఎన్నో వేదాంతాలు, ఎన్నో సందేహాలు ఉంటూండగానే మరో ఉపద్రవం వస్తోందని అంటున్నారు. అది ఏప్రిల్ 20న యుగాంతం అని జోస్యాలు చెబుతున్నాయట. ఆ రోజున భూమి పగిలి ముక్కలుగా చెక్కలుగా మారిపోతుందిట. ఇది వేదాంతులు చెబితే నాసా లాంటి వారు కూడా అతి పెద్ద గ్రహ శకలం భూమిని రాచుకుంటూ పోతుందని చెబుతున్నారుట.

 

ఇలా ఒక్కసారిగానే అటు కరోనా, ఇటు గ్రహ శకలాలు కలసి వినాశనాన్ని తేవడం ఏంటి. అసలు ఈ ప్రపంచానికి ఏమైంది. ఈ విశ్వం అంతమేనా. తిరుపతి దేవుడి దర్శనాలు లేవు. ఏ కోవెళ్ళలోనూ  భక్తులకు మొక్కులు  తీర్చుకునే వీలు లేదు. ఏంటిదంతా. ప్రళ‌యం, విలయం కలసి కట్టుగా వచ్చేశాయా. ఇలా ఆలోచనలతో  సగటు జనం భీతిల్లిపోతున్నారు. ఏదేదో ఊహించుకుని ఏదో అవుతుందని బెంబేలెత్తుతున్నారు.

 

 ఎంత ధైర్యంగా  ఎవరి మటుకు వారు  ఫరవాలేదు అని  చెప్పుకున్నా ఆలోచిస్తూంటే అనిపిస్తోంది. అసలు మానవాళికి ఏమైంది. ఎందుకిలా మ్రుత్యువు తరుముకొస్తోంది అని. దీనికి జవాబు లేదు, అది ఎవరి ఊహకు వారే చెప్పుకోవాలి అంతే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: