ఈ రాష్ట్రానికి జగనే సీఎం..దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ రాష్ట్రంలో సీఎం పదవితో పాటు మిగిలిన కొందరికీ అధికారం ఉంటుంది. వాళ్లంతా జగన్ చెప్పినట్టు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగాన్నికి సీఎం సర్వాధికారి అన్నమాట నిజమే అయినా సీఎం పరిధిలోని రాని కొన్ని పదవులు ఉంటాయి. వాటి అధికారాలను సీఎం కూడా ప్రశ్నించలేరు.

 

 

అవే రాజ్యాంగబద్దమైన పదవులు. ఇవే ఇప్పుడు జగన్ కు చిర్రెత్తిస్తున్నాయి. మొన్నటికి మొన్న మూడు రాజధానులపై బిల్లు చేద్దామంటే మండలి ఛైర్మన్ అడ్డుపడ్డాడు. ఆయన్ను జగన్ ఏమీ చేయలేకపోయారు. మండలి రద్దుకు సిఫార్సు పంపినా కేంద్రంలో కదలిక లేదు. ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇక నిన్నటికి నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జగన్ కు విపరీతంగా కోపం తెప్పించారు. కరోనా కారణంతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసి పారేశారు. ఆయన్నూ జగన్ ఏమీ చేయలేకపోయారు.

 

 

ఇక ఇప్పుడు మరో అధికారి ఏపీపీఎస్సీ ఛైర్మన్ రూపంలో జగన్ పై కత్తి దూస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ సర్కారు తనపై కత్తికట్టిందని.. అవమానిస్తున్నారని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీలో నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారట. చైర్మన్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ సెక్రెటరీ ద్వారానే జరుగుతున్నాయని.. ఫైళ్లపై మెంబర్లు గుడ్డిగా సంతకాలు పెడుతున్నారని... ఈ పరిణామం తనను కలచి వేస్తోందని ఆయన ఆరోపించినట్టు తెలిసింది.

 

 

అయితే.. ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ తాను ఆఫీసుకు వెళ్లి వస్తున్నానని ఏపీపీఎస్సీ ఛైర్మన్ అంటున్నారట. నియమ, నిబంధనల ప్రకారం.. ఏపీపీఎస్సీలో రోజువారీ కార్యకలాపాలు జరిగేలా చూడాలని గవర్నర్‌ ను ఆయన కోరారట. ఏపీపీఎస్సీ ఛైర్మన్ కూడా రాజ్యాంగబద్ద పదవి. దాన్నుంచి అతడిని తొలగించడం కూడా అంత సులభం కాదు. మరి జగన్ సర్కారు ఏం చేస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: