శానిటైజర్.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ శానిటైజర్ వాడండి అనే సూక్తులే వినిపిస్తున్నాయి. తరచూ చేతులు నీటితో కడిగే అవకాశం లేని వాళ్లు శానిటైజర్ వాడొచ్చు. భారత్‌తో సహా ప్రపంచాన్ని 'కరోనా వైరస్' హడలెత్తిస్తున్న నేపథ్యంలో ఈ శానిటైజర్ వాడకం బాగా పెరిగింది. డిమాండ్ అనూహ్యంగా పెరిగినందువల్ల వీటి లభ్యత కూడా తగ్గింది.

 

 

అయితే ఇదే శానిటైజర్ 11 ఏళ్ల క్రితం చిరంజీవి వాడితే అప్పట్లో కొన్ని పత్రికలు ఆయనపై బురద చల్లాయట. పిచ్చి రాతలతో అవమానించాయట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జర్నలిస్టు విక్రం పూల. అసలేం జరిగిందంటే.. 2008 ఆగస్టులో మెగాస్టార్ చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీ ఏర్పాటు చేశాక... ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఎక్కడకు వెళ్లినా ఆయన్ను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు.

 

 

 

వారందరితో ఆయన కరచాలనాలు, కలిసి ఫొటోలు దిగడం, ఆత్మీయంగా హత్తుకోవడం సర్వ సాధారణంగా ఉండేవి. అలా గంటల తరబడి షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల గంటల వ్యవధిలోనే ఆయన అరచేతులు మట్టి పట్టేసినట్టు అయిపోయేవి. ఆ సమయంలో చిరంజీవి 'శానిటైజర్'తో చేతులు శుభ్రపర్చుకునే వారు. మరో ఊరు రాగానే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యేది. గంట వ్యవధిలోనే మళ్లీ ఆయన అరచేతులు మట్టి పట్టేసిన‌ట్టు అయ్యేవి. ప్రతిసారి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లడం ఇబ్బంది కాబట్టి చిరు శానిటైజర్ వాడేవారు.

 

 

అయితే.. ఓ రోజు ప్రముఖ దినపత్రిక చిరంజీవి శానిటైజర్‌తో చేతులు శుభ్రపర్చుకొంటున్న ఫొటో వేసి.. అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు కడుక్కొన్న చిరంజీవి అనే హెడ్డింగ్ తో వార్త వేసిందట. అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన చిరంజీవి తన చేయి మైలపడినట్లు భావించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకొన్నారు.. అనే అర్థం వచ్చేటట్టు రాశారట. ఆ సమయంలో చిరంజీవి ఇమేజ్ ను దెబ్బ తీయడానికి పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలు ఇలా ప్రయత్నించాయట. కాదేదీ రాజకీయానికి అనర్హం అనిపిస్తోంది కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: