ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ నెల 27 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుందని సమాచారం. బడ్జెట్ సమావేశాల గురించి ఈరోజు లేదా రేపు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్చి 27 నుంచి 31 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి రెండు నెలల ఖర్చుల నిమిత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 
 
రాష్ట్రంలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఐదు రోజుల్లో బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు వైసీపీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. మరో రెండు రోజుల్లో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల్లో పోలింగ్ గురించి చర్చ జరగనుంది. 
 
వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల్లో ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటేయాలనే అంశం గురించి ఎమ్మెల్యేలను బృందాలుగా ఏర్పాటు చేయనుంది. ముగ్గురు అభ్యర్థులకు 38 మంది ఎమ్మెల్యేలు... ఒక అభ్యర్థికి 37 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేసేలా వైసీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. టీడీపీ నుండి గెలిచినా ముగ్గురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. 
 
ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలు పోలింగ్ కు దూరంగా ఉంటారని వార్తలు వస్తున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభకు అభ్యర్థి బరిలో నిలవడంతో పోలింగ్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ పథకం అమలును ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. కరోనా విషయంలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న ప్రభుత్వం రేషన్, పింఛన్లకు ఏప్రిల్ వరకు బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: