కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో....నివారణ చర్యల్లో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా అమెరికా నుంచి నేరుగా ఇంటికి వెళ్లి పోయారు కొమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లా సిర్పూర్  టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ఆంక్షలు విధించిన వేళ.. తనకు మాత్రం ఆ రూల్స్ వర్తించనట్టుగా వ్యవహరించారు కోనప్ప. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కోనప్ప, ఆయన సతీమణి రమాదేవి.. అమెరికా పర్యటనకు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారు. అయితే.. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. కానీ, కోనేరు కోనప్ప దంపతులు మాత్రం హైదరాబాద్ నుంచి రైల్లో కాగజ్‌నగర్‌కు ప్రయాణించడే కాకుండా.. స్థానికంగా పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంపై స్థానికులు మండిపడుతున్నారు. 

 

 

 

ఎమ్మెల్యేనే రూల్స్ బ్రేక్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంషాబాద్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎమ్మెల్యేను ఎలా వదిలేశారని నిలదీస్తున్నారు జనం. అమెరికాలోనూ కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన జిల్లా అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు క్వారంటైన్‌లో ఉండాలని నోటీసులు జారీ చేశారు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. దీంతో వారు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఎమ్మెల్యే దంపతులను కలిసిన వారిని కూడా క్వారంటైన్‌కు తరలించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

 

 

 

ఎమ్మెల్యే కోనప్ప తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో కాగజ్ నగర్‌కు చేరుకొని.. ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జిల్లా ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలోనూ ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోనప్ప కనీసం మాస్క్ ధరించకుండా వేలాది మందితో కాంటాక్ట్ అయ్యారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

సిర్పూర్ ఎమ్మెల్యే వ్యవహారంపై నేటిజన్లు మండిపడుతున్నారు. కరోనా పై కనీస అవగాహన కూడా లేనట్టుందని ట్రోల్ చేస్తున్నారు. అమెరికాలో వేలాది మంది కరోనా వైరస్ బారిన పడ్డారని.. ఇంతటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో ఎమ్మెల్యే అజాగ్రత్తగా వ్యవహరించడం మంచిది కాదని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పిన మాటలు కూడా వినరా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: