ఏపీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పరిస్థితిపై ఆరోగ్య శాఖ నుంచి వివరాలు సేకరించిందా...? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారో లేదో చెప్పాలని అన్నారు. కరోనా వల్ల ఎన్నికలను వాయిదా వేయాలనుకోవడం మంచిదే కానీ రాష్ట్ర పరిపాలనకు, రాష్ట్ర యంత్రాంగానికి సంబంధం లేకుండా మీ విచక్షణ అధికారం ప్రకారం మీరు చేశారని చెప్పారు. 
 
కేవలం ఆరు వారాలు మాత్రమే ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో ఈసీ చెప్పాలని వ్యాఖ్యానించారు. కరోనాపై సీఎం జగన్ ముందస్తు చర్యలకు ఆదేశించారని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో కరోనాను అంచనా వేయకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. ఎన్నికల్లో మెజార్టీ రాకపోతే పదవులు పోతాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 
 
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఎన్నికల కమిషనర్ తప్పుడు ప్రచారం చేస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేసినా ఎన్నికల కోడ్ అమలు చేశారని కోడ్ అమలు చేస్తే కరోనా వ్యాపించదా...? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారికంగా కరోనాపై ఈసీ సమీక్ష చేసిందో లేదో చెప్పాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే ముందు ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించిందో లేదో సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. 
 
కరోనా మీద అవగాహన ఉంటే అధికారులతో ఈసీ ఎందుకు మీటింగ్ పెట్టలేదు...? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఒత్తిడి ఉంటే ప్రతిపక్షాలు నామినేషన్లు ఎలా వేశాయో టీడీపీ సమాధానం చెప్పాలని అన్నారు. టీడీపీ వాళ్లు ఎన్నికల్లో నామినేషన్లు వేయకపోతే వైసీపీ బాధ్యత వహిస్తుందా...? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా ప్రవర్తించటం బాబుకు పరిపాటి అని అన్నారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: