ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో హైదరాబాద్ జనాలకు ఫారెనర్స్ ఫీవర్ పట్టుకుంది. నగరంలో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాంచీలు ఉండడంతో పెద్దసంఖ్యలో సిటీకి ఫారెనర్స్ వస్తుంటారు. వీరిలో చాలా మంది...వర్క్ తర్వాత నగరంలోని మాల్స్, పర్యాటక ప్రాంతాలను విజిట్ చేస్తున్నారు. దీంతో కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నారు. దీంతో హైదరాబాద్ వాసులు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏ సమయంలో ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

సాఫ్ట్ వేర్ రంగానికి హైదరాబాద్ పెట్టింది పేరు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి టూరిస్టులు, విద్యార్ధులు, స్కాలర్లు, ఇంజినీర్లు వందల సంఖ్యలో నగరానికి వస్తుంటారు. అయితే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న ఈ సమయంలో...ఒక్క మార్చి నెలలోనే దాదాపు 69 వేల మంది హైదరాబాద్ వచ్చారని తెలుస్తోంది. కొవిడ్ కేసులు విపరీతంగా ఉన్న ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల నుంచి గడిచిన పదిరోజుల్లో 540 మంది నగరానికి వచ్చారు.వీరిలో కొందరు ఐసోలేషన్ వార్డుకు వెళ్లగా మిగితా వారు ఎక్కడున్నారన్నది తెలీడం లేదు. 

 

 

అమెరికా, యూరప్ దేశాల నుంచి నగరారికి వచ్చిన వారే దాదాపు 40 వేల మంది వరకు ఉన్నారని... మలేసియా, సింగపూర్, దుబాయ్, గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు మరో 20 వేల వరకు ఉంటారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చి 10 నుంచి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ మొదలైన తర్వాత ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ నుంచి వచ్చిన దాదాపు 540 మంది ప్రజల్లో కలిసిపోయారనే వార్తలు జనాన్ని మరింత టెన్షన్ పెడుతున్నారు. 

 

 

వైరస్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి కట్టడి చేయకపోతే...భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు నిపుణులు. వైరస్ నియంత్రణ చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని అభిప్రాయపడుతున్నారు. వలసలు ఇలాగే కొనసాగితే...వచ్చే పదిరోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని లాక్ డౌన్ ప్రకటించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: