టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో... ఇప్పటికే తిరుమల కొండపైకి భక్తులను నిషేదించారు అధికారులు. భక్తులు లేకపోవడంతో ఏడుకొండలు బోసిపోయాయి. భక్తుల కోసం తయారు చేసిన లడ్డూల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ఆ లడ్డూలను టీటీడీ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు ఆలయ అధికారులు.

 

 

కొండపైకి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శ్రీవారి లడ్డూలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పెద్దసంఖ్యలో అదనపు లడ్డూలను తయారు చేస్తుంటారు. దీంతో భక్తులకు కావాల్సిన లడ్డూలను టీటీడీ సిద్దం చేసింది. వీటితో పాటు అదనంగా లడ్డూలను కోరుకునే భక్తుల కోసం మరో లక్ష వరకు లడ్డూలను తయారు చేశారు. అయితే కరోనా ప్రభావంతో...శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించకపోవడంతో లడ్డూల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ప్రస్తుతం తిరుమల కొండపై దాదాపు రెండున్నర లక్షల లడ్డూలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవి ఇలాగే ఉంచితే పాడైపోయే అవకాశం ఉండడంతో...వీటిని ఉగాది కానుకగా సిబ్బందికి పంచాలని టీటీడీ నిర్ణయించింది. 

 


మరోవైపు కరోనా ప్రభావంతో...తిరుమలగిరులు బోసి పోయి కనిపిస్తున్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా భక్తులను దర్శనాలకు అనుమతించడం లేదు అధికారులు. కనుమమార్గంతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులను మూసివేశారు.

 

 

 రెండు ఘాట్ రోడ్లపైకి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో కొండపై నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కళ్యాణకట్ట, మాడ వీధులు, వైకుంఠం క్యూకాంప్లెక్సులు, లడ్డూ ప్రసాద కేంద్రాలు, ఆనంద నిలయం, శ్రీవారి పాదాలు ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఎటు చూసినా నిర్మానుష్య ప్రాంతాలే కనిపిస్తున్నాయి. దాదాపు 500 ఏళ్ల తర్వాత...తిరుమల కొండ బోసి పోయి కనిపిస్తోంది. కేవలం సిబ్బంది అర్చకులు తప్ప ఎవరూ శ్రీవారి ఆలయంలోకి వెళ్లడం లేదు. స్వామివారికి నిర్వహించే ఆర్జీత సేవలను అధికారులు రద్దుచేయగా... నిత్యం జరిపే కైంకర్యాలు మాత్రం కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: