టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం నిరవధికంగా నిలిచిపోయింది. కరోనా వైరస్ కారణంగా వారం రోజుల పాటు భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని టీటీడీ తెలిపింది. శ్రీవారి పూజా కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది ఆలయకమిటీ.

 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమలపైనా పడింది. శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. జనసమూహాలు పెద్ద ఎత్తున పోగవ్వడంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో ఆలయంలోకి వారం పాటు భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. 

 

శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసింది ఆలయకమిటీ. స్వామివారి కళ్యాణోత్సవ సేవను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారికి ప్రతినిత్యం నిర్వహించే వసంతోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవతో పాటు పలు విశేష పూజలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది టీటీడీ. వేకువజామున 3 గంటలకు నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని.. అన్ని పూజా కైంకర్యాలను వారం రోజుల పాటు ఏకాంతంగా నిర్వహించనున్నారు అర్చకులు. 

 

1892వ సంవత్సరంలో శ్రీవారి ఆలయ జియ్యంగార్లు, మహంతులు మధ్య వివాదం తలెత్తడంతో రోండు రోజులు పాటు శ్రీవారి ఆలయం మూతపడింది. తిరిగి ఇప్పుడు నిరవధికంగా భక్తులను దర్శనానికి అనుమతించకూండా టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే తిరుమల కొండలు ఇప్పుడు మూగబోయాయి. తిరుమల గిరుల్లో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. భక్తుల తాకిడి లేకపోవడంతో దుకాణాలు మూతపడ్డాయి. 

 

ఈ నెల 31 వరకు ఇదే పరిస్థితి కోనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం రోజుల తరువాత పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆలయకమిటీ తెలిపింది. ఇక ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు ధన్వంతరి యాగాని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ, మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రానంద స్వామీజీల ఆధ్వర్యంలో ఈ యాగం జరగనుంది. ఇప్పటికే తోమ్మిది రోజుల పాటు ఆరోగ్య జపాన్ని నిర్వహిస్తోంది టీటీడీ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: