తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన 21 పాజిటివ్ కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివేనని అన్నారు. ఇప్పటివరకూ విదేశాల నుంచి రాష్ట్రంలోకి 20,000 మంది విదేశీయులు వచ్చారని 11,000 మందిని సిబ్బంది అదుపులోకి తీసుకోవడమో... లేదా హోం క్వారంటైన్ చేయడమో చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వ వైద్య సిబ్బందిని లేదా పోలీస్ అధికారులను కలవాలని సూచించారు. 
 
విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించడం లేదా ఇళ్లకే పరిమితం కావాలని సూచించడం చేస్తామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు తమ కుటుంబ సభ్యుల కోసం, సమాజం కోసం ముందుకు రావాలని అన్నారు. మూడు వారాలు సామాజిక దూరం పాటిస్తే కరోనాపై విజయం సాధించవచ్చని చైనాలో ఆ విషయం ఇప్పటికే ప్రూవ్ అయిందని తెలిపారు. ప్రధాని మోదీ రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 
 
సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రజలు జనతాకర్ఫ్యూలో భాగం కావాలని కోరారు. కరోనా వైరస్ కు స్వాభిమానం ఎక్కువ అంటూ కేసీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. వైరస్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందని... దాని దగ్గరకు మనం వెళితే తప్ప మన దగ్గరకు అది రాదు అని... అది మంచి గుణం ఉన్నది అని... స్వాభిమానం ఎక్కువ అని వ్యాఖ్యలు చేశారు. 
 
జనతా కర్ఫ్యూను 24 గంటలు పాటించి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు 5574 నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని కరోనా వ్యాప్తిని అరికట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రేపు జనతాకర్ఫ్యూలో భాగంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు రాకపోకలు సాగించవని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: