జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు 2 నిమిషాల పాటు అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రేపటి జనతా కర్ఫ్యూని అందరూ విధిగా పాటించాలని పిలుపు నిచ్చారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో ఉండాలని కోరారు. ‘విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరూ దాచుకోవద్దు. మీరు దాచుకోవాలనుకున్నా అది దాగదు. సిన్సియర్‌గా చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తున్నా.

 

విదేశాల నుంచి వచ్చినొళ్లు బయట తిరగొద్దు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించండి. స్వచ్ఛందంగా మీరే స్థానిక ఆస్పత్రిలో రిపోర్ట్ చేయండి. ఐసోలేషన్ లో ఉంచి చెకప్ చేస్తారు. ఇది మీకు, మీ కుటుంబానికి మంచిది.  ముందు జాగ్రత్తలు పాటిస్తే కరోనాను అడ్డుకోవచ్చని చెప్పారు సీఎం కేసీఆర్. ఇదొక క్లిష్టమైన సమయమని... అందరూ కలసి కట్టుగా దీన్ని ఎదుర్కోవాలని అన్నారు. రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవవని చెప్పారు.  విదేశాల నుంచి వచ్చినోళ్లు బయట తిరిగి సమాజానికి ప్రమాదం తేవొద్దని కోరారు. ‘మీరంతా కూడా మా బిడ్డలే. దయ చేసి ప్రభుత్వానికి సహకరించండి. మేం అన్ని మార్గాల్లో వివరాలు సేకరిస్తున్నాం. మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా తీసుకుంటున్నాం.

 

ఇప్పటివరకు 11 వేల మంది అనుమానితులను గుర్తించి వారిని పరిశీలిస్తున్నామని, అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సరిగా తెలియడంలేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని, ఆయన 14 గంటలు పాటిద్దాం అని చెప్పారని, కానీ తెలంగాణ వాసులు రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించి సామాజిక బాధ్యతను చాటాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: