ఐక్య రాజ్య సమితి ప్రపంచ దేశాలకు ఉమ్మడి వేదిక. ప్రపంచ రాజకీయాలు, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు అన్నీ పరిశీలించే ఓ అత్యున్నతమైన సంస్థ. ఐక్య రాజ్య సమితిలో భారత్ కి శాశ్వత సభ్యత్వం లేదు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ కి అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ ఎందుకో ఐక్య రాజ్యసమితి లో ఈ హోదా దక్కలేదు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఐక్య రాజ్యసమితి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు భారత్ కి షాకింగ్ గా మారాయి. నిన్నటికి నిన్న నిర్భయ హంతకులను ఉరి తీసి జై భారత్ మాతా అనుకుంటున్న భారత్ కి ఈ ఘాటు కామెంట్స్ మింగుడుపడనివే.

 

ఉరి శిక్షలు ఇంతటితో ఆపేయాలంటూ పరోక్షంగా ఐక్య రాజ్యసమితి భారత్ కే ఓ పదునైన సందేశాన్ని పంపించిందనుకోవాలి. ఎటువంటి దోషులకైనా ఉరి శిక్షలు ఉండరాదని గట్టిగా అభిప్రాయపడింది. ఒక వేళ ఉరిని రద్దు చేసుకోలేకపోతే కొంతకాలం పాటు వాటిని ఆపి అయినా ఉంచాలని సూచించింది.

 

నిజానికి భారత్ లో అహింస‌ పుట్టింది. ఓ బుద్ధుడు, మరో గాంధీ హింస వద్దు అని చెప్పారు. చీమకు కూడా హాని చేయకూడద‌ని జైనులు చెబుతారు. అలాంటి అన్ని మతాలూ ఇండియాలో ఎన్నో ఉన్నాయి. మరి హింసకు  హింస‌ జవాబు కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ ఒక రాజ్యం తానే స్వయంగా ఉరి శిక్షలను ప్రోత్సహించడం తగని పని అని మేధావులు, నిపుణులు అంటారు.

 

శిక్షలు ఏవైనా దోషులకు పరివర్తన ఉండాలన్న‌దే వాటికి అర్దం, పరమార్ధం. అలాంటిది ఆ దోషిని ఈ భూమికి దూరం చేసి నిర్జీవుడిని చేస్తే ఇక నేరాలు ఆగుతాయా. ఉరి శిక్షలు రద్దు కోరుతూ ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా ఆగడంలేదు. అందునా భారత్ లాంటి దేశం ఒకటి కాదు నాలుగు ఉరితాళ్ళను పెట్టి మరీ నిర్భయ హంతకునలు ఉరి తీయడాన్ని మానవ హక్కుల సంఘాల వారు కూడా తప్పుపడుతున్నారు.

 

నిర్భయకు జరిగిన దాడి, ఆమెపైన జరిగిన  హత్యాచారం ఎవరూ సమర్దించరు, కానీ దానికి ఉరి శిక్షలే జవాబు అంటే 2012 నుంచి ఇప్పటివరకూ ఎన్నో లైంగిక దాడులు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. సిస్టంలో ఎక్కడో తప్పు ఉంది. సమాజంలో కూడా రుగ్మతలు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించకుండా మహిళా ఓట్ల కోసం రాజకీయాల కోసం ఇలాంటి వాటిని కొంతమంది సమర్ధిస్తున్నారని అంటున్నవారు ఉన్నారు.

 

ఇవన్నీ పక్కన పెడితే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్‌, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్  ఉరిశిక్షలపై తాజాగా  స్పందించారు. ఆంటోనియా గ్యుటెరెస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని దేశాలన్నీ మరణశిక్షను ఆపివేయాలి. లేదా కనీసం ఉరి శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుందని విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

 ఓ విధంగా ఇది భారత్ కి షాక్ లాంటిదే. ఎన్నో మంచి పనులు చేస్తూ ధర్మాన్ని నమ్మే గడ్డ మీద సాటి మనిషి ఉసురు తీయడం క్షంతవ్యం కాదన్న మాట గట్టిగా వినిపిస్తోందిపుడు. ఇకనైనా ఉరి శిక్షలకు బదులు కఠిన చట్టాలను తీసుకురావడం. సమాజంలో మార్పులకు క్రుషి చేయడం వంటివి చేయాల్సిన అవసరం అన్ని దేశాలకు ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: