కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆరు వారాల తర్వాత కూడా ఎన్నికలు జరగడం కూడా కష్టమే అని అర్ధమవుతుంది. ఇక ఎన్నికలు ఎప్పుడైతే వాయిదా పడ్డాయో అప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ కాస్త ఊపిరి పీల్చుకుంది. ఒకవేళ ఎన్నికలు జరిగి ఉంటే ఎంతమంది టీడీపీ నేతలు పార్టీని వీడేవారో లెక్క ఉండేది కాదు.

 

అసలు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడమే టీడీపీ నేతలు వరుస పెట్టి వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇక దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్న కరణం బలరాం, రామసుబ్బారెడ్డిలు కూడా వైసీపీ వైపు వచ్చేశారు. అయితే ఎన్నికలు వాయిదా పడటంతో ఈ వలసలకు కూడా బ్రేక్ పడింది. కానీ మళ్ళీ ఎన్నికలు మొదలైతే వలసలు మొదలవ్వడం ఖాయమని అంటున్నారు.

 

రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీ నాయకులు వైసీపీలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అలాగే కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇప్పటికే డొక్కా మాణిక్యవరప్రసాద్, శమంతకమణిలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక మరో ఎమ్మెల్సీ శివనాథరెడ్డి కూడా టీడీపీకి దూరంగా ఉన్నారు. ఆయన కూడా వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కేఈ ప్రభాకర్ కూడా టీడీపీకి రాజీనామా చేసేశారు.

 

వీరేగాకుండా మరికొందరు ఎమ్మెల్సీలు వైసీపీ వైపు రావోచ్చని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన వారు బాబుకు షాక్ ఇచ్చేస్తారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి బంధువైన టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ శతృచర్ల విజయరామరాజు వైసీపీలోకి వెళ్లొచ్చని ప్రచారం జరుగుతుంది. ఆయన ఎప్పటి నుంచో పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. మండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో కూడా రాలేదు. కాబట్టి ఈయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. మరి చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైతే ఎంతమంది బాబుకు షాక్ ఇస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: