ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు రెచ్చిపోతుంది. దాదాపు అన్ని దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ దెబ్బకు 13 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, ఎక్కడిక్కడ జన జీవనం ఈ వైరస్ దెబ్బకు స్తంభించిపోయింది. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే వైరస్ మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ప్రజలు కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ఇప్పుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా గుప్పిట్లో ఉంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ కూడా కనుక్కోలేదు. 

 

దీనితో ఏ స్థాయిలో వినాశనం జరుగుతుందో అనే భయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఇది 188 దేశాల్లో విస్తరించింది. ఈ దేశాల్లో మొత్తం 304999 మందికి కరోనా సోకింది. వీళ్లలో 94793 మంది రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య 13003 కి చేరింది. ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 327కి చేరింది. వీరిలో 300 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణాలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఎవరికి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. 

 

ఇక తెలంగాణా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉంది. అక్కడ దాదాపు 80 కరోనా కేసులు నమోదు అయినట్టు సమాచారం. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పబ్లిక్ సర్వీసులను ఆపేయాలి అని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ నాగపూర్, పూణే ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆయా ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: