ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడిలో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని... తప్పనిసరైతే తప్ప బయటకు రావొద్దని మోదీ సూచించారు. సాధారణంగా కరోనా ప్రజలు తిరిగే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రజలు బయటకు రాకుండా ఉండటం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు.  
 
ప్రజలు ఇంటికే పరిమితమైతే పబ్లిస్ ప్లేసెస్ లో ఉండే వైరస్ చనిపోయే అవకాశం ఉంది. వైరస్ ఉన్న స్థలాల్లో ప్రజలు ఉండకపోవడం, వైరస్ ను తాకకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతోంది. ఈరోజు కర్ఫ్యూ ద్వారా ప్రజలకు కలిగే అనుభవాలు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. కరోనా వైరస్ వ్యాప్తికి సామాజిక దూరం పాటించి అడ్డుకట్ట వేయవచ్చు. 
 
14 గంటలు ప్రజలు ఇంటికే పరిమితం కావడం వల్ల ప్రజలు వారికి తెలియకుండానే సామాజిక దూరం పాటిస్తారు. 14 గంటల పాటు ఒకరితో ఒకరు కలవకుండా ఉంటే వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు పరిస్థితి కొంతవరకు కచ్చితంగా అదుపులోకి వస్తుంది. ఇప్పటికే కేంద్రం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. 
 
ఉరుకుల పరుకుల జీవితంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో గడిపే అవకాశం లేకుండా పోతుంది. జనతా కర్ఫ్యూ వల్ల పిల్లలు తల్లిదండ్రులతో ఈ ఒక్కరోజు సంతోషంగా గడపవచ్చు. కరోనా జాగ్రత్త చర్యలు పాటిస్తూనే తల్లిదండ్రులు పిల్లలతో గడపాలి. వీలైతే తల్లిదండ్రులు పిల్లలకు కరోనా గురించి, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తచర్యల గురించి పిల్లలకు వివరిస్తే మంచిది. తెలంగాణలో ఇప్పటివరకూ 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: