ఈ జీవితం ఒక అడవిలాంటిది.. ఇందులో సమస్యలనే మృగాలే కాదు.. ఆనందాలనే మయూరాలు కూడా ఉంటాయి.. ఇక అడవిలో సాధు జంతువులు నిత్యం పరిగెడుతూనే ఉండాలి.. లేదంటే మృగానికి ఆహారం అవుతుంది.. ఇక మృగం లేవగానే వేటకై పరుగులు పెట్టాలి లేదంటే ఆకలితో చచ్చిపోతుంది.. ఇలాగే జీవితం కూడా ఉంటుంది.. ఆగి అలిసిపోయామంటే ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టుతాయి.. ప్రస్తుతం లోకం పరిస్దితి ఇలాగే ఉంది.. కరోనా అనే దయాదాక్షిణ్యాలు లేని రాక్షసుడు లోకం మీద పడి దొరికిన వారిని దొరికినట్టుగా నమిలేస్తున్నాడు..

 

 

ఈ పరిస్దితుల్లో వీన్ని ఎదుర్కోవాలంటే ఒక బిజినెస్ మ్యాన్, ఒక నటుడు, చివరికి శత్రువులను సైతం గడగడలాడించిన సైనికుడు కూడా సరిపోవడం లేదు.. ఈ రోగానికి ప్రత్యేకదళం ఉంది.. అదే వైద్యం.. ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడేవారు ఎవరంటే వైద్యులే.. అవును ఆ దైవం కనిపించక మంచి చేస్తుంటే, ఈ వైద్యుడు కంటికి కనిపిస్తూ ప్రాణాలు కాపాడుతున్నాడు.. ప్రస్తుతం ప్రపంచానికి దేవుడు అని చెప్పుకునే వారు ఎవరైనా ఉన్నారంటే వారు కరోనా సోకిన వారికోసం సేవచేస్తున్నవారే.. నిజంగా ఎవరు ఒప్పుకోకపోయినా, ఒప్పుకున్న ఇది నిజం..

 

 

ఇప్పుడు ప్రతి నర్సు మదర్ థెరిస్సానే.. ప్రతి డాక్టర్ పరమాత్ముడే.. వీరే కాదు కుటుంబాన్ని, పిల్లలను, కన్న వారికి దూరంగా ఉంటూ వారి ప్రాణాలను పణంగా పెట్టి కరోనా కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బంది అంతా దైవాలే.. ఈ సృష్టిని ఆ బ్రహ్మ సృష్టిస్తే.. ఆ సృష్టిని కాపాడే బాధ్యతను తమ భుజాల మీద వేసుకున్న సైనికులు ఈ వైద్య సేవకులు.. ఇక్కడ పోరాడే ఒక్కోనర్సు వెనుక కంటికి కనిపించని కన్నీటి ధారలు ఎన్నో ఉన్నాయి.. ఒక్కో వైద్యుడి ఆవేదన వెనక ఎన్నో అర్ధాలు ఉన్నాయి.. కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుని మీ ప్రాణాలు కాపాడుకోండని చెబితే ఎవడు చెవిన పెట్టడం లేదు..

 

 

కాని రోగం వచ్చాక వారిని కాపాడటం కోసం సేవచేస్తున్న బిడ్దలు ఎందరో మండే ఎడారిలో, భగ భగ మంటల మధ్య దేశం కోసం యుద్దం చేసే సైనికున్ని తలపిస్తున్నారు.. ఇలాంటి వారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలరు.. ఎన్ని కోట్లు వెచ్చించి వారిని సన్మానించగలరు.. దేశానికి పతకాలు తెచ్చినా వారు కోట్లు సంపాధించుకుని హయిగా బ్రతుకుతున్నారు.. కానీ ఇలాంటి విపత్తు సమయంలో ఈ అవని భారాన్ని తమ భుజాల మీద మోస్తు అమ్మతనాన్ని పణంగా పెట్టి కన్న బిడ్దలకు దూరమై సేవచేస్తున్న ఎందరో అరకొర జీతాలతో బ్రతుకుతున్నారు.. వారు ఎలా జీవించిన ఇప్పుడు ప్రపంచం మొత్తం వారిని గుర్తిస్తుంది.. ఇలాంటి వారిని కన్న తల్లిదండ్రులు నిజంగా పుణ్యాత్ములు.. వారికి చెతులెత్తి నమస్కరించినంత మాత్రాన మన కిరిటాలు పడిపోవు.. 

 

 

ఇన్నాళ్లు మనుషుల్లో మృగాలను చూస్తున్న వారికి ఇప్పుడు దేవుళ్లు దేవతలు కూడా కనిపిస్తున్నారు.. ఇక ఇప్పుడు ప్రపంచ విజేతలు ఎవరంటే వైద్య సిబ్బందని ఒప్పుకోక తప్పదు.. ఈ రోజు ఇంకా ప్రపంచం బ్రతికి ఉందంటే మన కంటికి కనిపించని వారెందరో తెరవెనక చేస్తున్న పోరాట ఫలితమే.. ఇది నీ ఒక్కని సమస్య కాదు.. నీలాంటి ప్రాణమున్న ఎన్నో ప్రాణుల సమస్య.. లోకంలోని ప్రజల్లారా మానవత్వాన్ని మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చూపండి.. వీలైతే కరోనా అనే రాక్షసున్ని అంతమొందించడానికి పోరాడండి.. . 

మరింత సమాచారం తెలుసుకోండి: