రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5కు చేరింది. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి పదోతరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పరీక్షలు నిర్వహిస్తే సెంటర్ల దగ్గర విద్యార్థులు గుంపులుగా చేరే అవకాశం ఉంది. నిపుణులు పరీక్షల సందర్భంగా పిల్లలు గుంపులు గుంపులుగా చేరితే నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు జరగాల్సి ఉంది. 6,40,000 మంది విద్యార్థులు రాష్ట్రంలో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కరోనా తీవ్రత దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా వార్షిక పరీక్షలు రద్దయ్యాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో హైకోర్టు తీర్పుతో పరీక్షలు వాయిదా పడ్డాయి. 
 
ఈ నెల 29న పరీక్షల విషయంలో సమీక్ష జరిపి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని బట్టి ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్షలకు ముందుగానే  సమీక్ష చేసి కీలక నిర్ణయం ప్రకటించనుందని సమాచారం. ఏపీలో పదో తరగతి పరీక్షల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తెలంగాణలో పరీక్షలు వాయిదా పడటంతో ఏపీలో పరీక్షలు వాయిదా పడే అవకాశాలు ఐతే పుష్కలంగా ఉన్నాయి. 30 లోగా కరోనా ప్రభావం తగ్గినా పరీక్షలు వాయిదా వేయడం మంచిదని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నారు. ప్రభుత్వం నుండి అతి త్వరలో పదో తరగతి పరీక్షల గురించి కీలక ప్రకటన రానుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: