ఇటలీని కరోనా స్మశానంలా మార్చేసింది. మహమ్మారి ప్రభావిత దేశాల్లో చైనాను కూడా మించిపోయి తీవ్రమైన సంక్షోభాన్ని చూస్తోంది. దేశం మొత్తం లాకౌట్ ప్రకటించి మిలటరీని రంగంలోకి దింపినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. నార్త్ ఇటలీలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఎవరిని పలకరించినా కరోనా విషాదమే..! ఆరు కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో 50వేలకు మించిన కేసులు అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి.

 

ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బాధిత దేశాలే. అయితే ఇటలీలో మాత్రం కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారి మెల్లగా ఇటలీకి పాకి... ఇప్పుడు ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. కరోనా కేసులు...మరణాల్లో చైనాతో పోటీపడుతోంది ఇటలీ. ప్రమాదాన్ని ఊహించి చర్యలు తీసుకునే లోపే... ఇటలీని కబళించి వేసింది కోవిడ్ 19 వైరస్. ఒక్కరోజులోనే 6వేల 557 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

2018 జనాభా లెక్కల ప్రకారం ఇటలీ జనాభా ఆరు కోట్ల పైచిలుకు.... ఇందులో 53వేల 578 మందికి కరోనా సోకింది. 4 వేల 825 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు విషయంలో ఇటలీ చైనాను మించి పోయింది. చైనాలో 3వేల 255 మంది చనిపోతే...ఇటలీలో ఆ సంఖ్య పెరిగిపోయింది. చైనా జనాభాతో పోల్చితే ఇటలీ జనాభా తక్కువే. ఇటలీలోని మొత్తం జనాభాలో 0.09 శాతం మందికి వైరస్‌ సోకింది. 0.09 శాతం అన్నది తక్కువగా కనిపించినా...
దేశం మొత్తం చూపిస్తున్న ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. 

 


ప్రపంచంలోనే వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఇటలీలో ఆరు కోట్ల జనాభా ఉంటే... 23 శాతం మంది 65 యేళ్లు వయసు పైపడిన వాళ్లే. అమెరికాలో ఈ వయసు వాళ్లు ఉన్న శాతం 16 మాత్రమే. కరోనా ప్రభావం 60 యేళ్ల పైపడిన వాళ్లపైనే ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దాని ప్రకారం చూసుకుంటే... ఇటలీ జనాభాలో ఉన్న 23 శాతం వృద్ధులు కరోనాకు బలైపోతున్నారు.

 

ఇటలీలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది. పెద్ద వాళ్లతో యువత ఇంటరాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇటలీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు నార్త్ ఇటలీలో చైనా ఆధ్వర్యంలో నడిచే టెక్స్‌టైల్ పరిశ్రమల్లో లక్షలాది మంది వుహాన్ కార్మికులు పనిచేస్తున్నారు. 
వుహాన్‌లో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత కూడా  చైనా ఇటలీ మధ్య యదేచ్ఛగా రాకపోకలు సాగాయి. దీంతో వైరస్ ఇటలీ వ్యాప్తంగా విస్తరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: