మనిషి బేసికల్ గా స్వార్ధ జీవి. పుట్టుకతోనే ఆ లక్షణం ఉంటుంది.  ఎందుకంటే అది అవసరం. అనివార్యం. లేకపోతే మనుగడ సాగించలేడు. అయితే ఈ స్వార్ధం నిర్మాణాత్మకంగా ఉండాలి. తాను బాగుండాలి అని కోరుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ తానొక్కడే బాగుండాలన్న దుర్నీతిని మాత్రం  అంతా ఖండించాల్సిందే.

 

ఇపుడు ఆధునిక జీవన విధానంలో ఈ దుర్నీతి రాజ్యమేలుతోంది. మానవుడు తన సొంత లాభం చూసుకుంటున్నాడు. పక్కవాడు ఏమైపోతేనేం అన్న ధిక్కార వైఖరి, అహంకారపూరితమైన ధోరణి కనబరుస్తున్నాడు. దాని వల్లనే ఎక్కడలేని సమస్యలు వస్తున్నాయి. ఎంతో మేదస్సు మెదడు నిండా ఉన్న మనిషి అతి చిన్న లాజిక్ మిస్ అవుతున్నాడు.

 

అదేంటి అంటే తాను ఒక్కడే బాగుండడమేంటి. పక్కవాడు బాగులేకుండా తాను మాత్రం బాగా ఉండగలడా, అసలు బతికి ఉండగలడా. ఈ తర్కాన్ని మరచి మానవుడు వితండవాదం చేస్తున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయానని అనుకుంటున్నాడు. మరి కరోనా వైరస్ ఏ కారణంగా వచ్చిందో తెలియదు కానీ మారిపోయి పూర్తి స్వార్ధ జీవిగా  ఉన్న మనిషిని,  ఆయన లోపలి మానవత్వాన్ని తట్టిలేపుతోంది.

 

 

ఇన్నాళ్ళూ తాను మాత్రమే బాగుండాలి అనుకున్న మానవుడు ఇపుడు పక్కవాడి వైపు చూస్తున్నాడు. పక్కవాడు బాగుండాలని గట్టిగా కోరుకుంటున్నాడు. కరోనా వైరస్ పక్క వారి నుంచి సోకే అవకాశం బాగా ఉండడంతో తనతో పాటు సాటి మనిషి ఆరోగ్యం కూడా ఇపుడు గుర్తుకువస్తోంది. 

 

ఏది ఏమైనా పక్కవాడు బాగుపడితే కళ్ళలో నిప్పులు పోసుకునే సమాజంలో కరోనా తెచ్చిన ఈ మార్పు హర్షించవలసిందేనని అంటున్నారు. ఇదే స్పూర్తితో మానవాళి  మొత్తం ఉంటే ఈ విశ్వమే వైభవంగా మారదా. అపుడు కరోనా లాంటి వైరస్ లు ఎన్ని వచ్చినా గట్టిగా ఒకరికి ఒకరు నిలబడి తరిమికొట్టలేరా. అరికట్టలేరా..కచ్చితంగా చేయగలరు...ఇదే  నిజం.  ఇదే సత్యం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: