దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కు చేరింది. గుజరాత్ లోని సూరత్ లో మరో వృద్ధురాలు కరోనా భారీన పడి మృతి చెందటంతో మృతుల సంఖ్య 7కు చేరింది. మనలో చాలా మంది ఇంట్లో ఉంటే కరోనా సోకదని భావిస్తున్నారు. కానీ ఇంట్లో ఉన్నా కరోనా సోకే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఇంట్లో ఉన్నవారే కరోనా భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
ఇంట్లో ఉన్నవారికి కరెన్సీ నోట్లు, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకుల ద్వారా కరోనా సోకే అవకాశం ఉంది. అందువల్ల ఇంట్లో ఉండేవారు బయట నుంచి తెచ్చిన వస్తువులను శానిటైజర్ రాసుకొని మాత్రమే పట్టుకోవాలి. పండ్లు, కూరగాయలను కొనుగోలు చేసిన తరువాత శుభ్రంగా కడగటంతో పాటు చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి. 
 
కొన్ని రోజుల పాటు న్యూస్ పేపర్స్ కు దూరంగా ఉంటే మంచిది. న్యూస్ పేపర్ ద్వారా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా లెటర్స్, కొరియర్స్ ఇంటికే వచ్చే అవకాశం ఉంటే వాటి కొరకు ఒక ట్రే ఉపయోగించాలి. శానిటైజర్ రాసుకున్న తర్వాత మాత్రమే వాటిని తాకాలి. కొన్ని రోజుల పాటు పని మనుషులకు పనికి రావద్దని చెప్పి సొంతంగా అన్ని పనులు చేసుకోవడం ఉత్తమం. 
 
హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే బదులు ఇంట్లోనే వంట చేసుకోవడం మంచిది. కీ బోర్డులు, సెల్ ఫోన్లు, రిమోట్ లను ప్రతిరోజూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బయటకు వీలైనంత వరకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా... వెంటనే స్నానం చేయాలి. వృద్ధులు, పసి పిల్లలు ఎట్టి పరిస్థితులలోను ఇంటికే పరిమితం కావడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: