ఆర్ధిక మాంద్యం అంటే ఆర్ధిక నిపుణుల భాషలో వాడే మాట. అదే సాధారణ పదాల్లో చెప్పాలంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం. పరపతి లేక, ఉత్పత్తి కానరాక, మొత్తానికి మొత్తం కునారిల్లిపోయే పరిస్థితి. భారత్ లాంటి దేశాలకు ఆర్ధిక మాంద్యం  దెబ్బ పెద్దగా తగలలేదు. ఎపుడో 19వ శతాబ్దం తొలినాళ్ళలో కొంత చవి చూసి ఉంటారు. ఇపుడు మళ్ళీ అలాంటి సీన్ ఈ జనరేషన్ చూస్తుందా.

 

అంటే అవును అనే అంటున్నారు ఆర్ధిక నిపుణులు. నిజానికి 2008 ప్రాంతంలో కూడా ప్రపంచం అంతా ఆర్ధిక మాంద్యంతో విలవిల్లాడింది.కానీ భారత్ లో మాత్రం అటువంటి బెంగ లేకుండా నాడు ప్రధాని, ఆర్ధిక వేత్త అయిన మన్మోహన్ సింగ్ చక్కదిద్దారు. ఇపుడు చూసుకుంటే మామూలుగానే ప్రపంచంలో ఆర్ధిక మాంద్యం ఉంది. దానికి తోడు అన్నట్లుగా కరోనా వైరస్ రక్కసి దూసుకువస్తోంది.

 

కరోనా మీద పోరు అంటే దానికి ఎంత ఖర్చు అన్నది లెక్కలో తేలనిది. ఎటువంటి పనీ పాటా లేకుండా యావత్తు 130 కోట్ల మంది జనం ఇంట్లో కూర్చుంటే ఏదో నాటికి కరోనా తగ్గుముఖం పడుతుంది. కానీ ఆ తరువాత పరిస్థితి ఏంటి. ఇక ఇంట్లో కూర్చున్న జనం కారణంగా ఉత్పత్తి ఎక్కడ నుంచి వస్తుంది. వ్యాపార ఆర్ధిక లావాదేవీలు పూర్తిగా పడకేశాక నిధులు ఎక్కడ నుంచి వస్తాయి.

 

అంటే ఓ విధంగా కరోనా రెండు వైపులా పదునైన కత్తి అన్నమాట. ఉంటే మనిషిని చంపి తీసుకెళ్తుంది. లేకుంటే ఆకలితో చంపి తీసుకెళ్తుంది. అసలే దేశంలో గత నాలుగేళ్ళుగా ఆర్ధిక అభివ్రుధ్ధి సూచీ నేల చూపులు చూస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత సీన్ బాగా డౌన్ అయింది. దానికి తోడు ఆర్ధిక మాంద్యం, ఇపుడు కరోనా వరస దెబ్బలతో భారత దేశం పతనం అంచులకు చేరుకుంటోందని ఆర్ధిక వేత్తలు తల్లడిల్లుతున్నారు.

 

కరోనా మందు తయారీకి కనీసంగా ఏడాది పడుతుంది. అంతవరకూ ఇక్కడి వారు మళ్ళీ విదేశాలకు వెళ్ళి ఉపాధి చూసుకునే చాన్సే లేదు. ఇక ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి లేదు. ఎంతో మంది కరోనా కారణంగా కొత్తగా నిరుద్యోగులవుతారు. ఓ విధంగా ఆకలి భారత దేశం, నిరుద్యోగ భరతం గా మారుతుందేమోనన్న ఆందోళన అందరిలో ఉంది.  చూడాలి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: