ప్రపంచం మొత్తాన్ని  వణికిస్తున్న కరోనా వైరస్ తెలుగురాష్ట్రాల్లో  ప్రమాదకరమైన మూడో దశకు చేరుకుంటోందా ?  అందరిలో ఇదే విషయమై టెన్షన్ పెరిగిపోతున్నాయి. దేశం మొత్తం మీద 670 జిల్లాలుంటే ఇందులో 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలంటూ  కేంద్రప్రభుత్వం ఆదేశాలిచ్చింది.  ఈ 75 జిల్లాల్లో  తెలుగురాష్ట్రాల్లోని 8 జిల్లాలు కూడా ఉండటమే ఆందోళనకరంగా ఉంది. కేసులు పెరగటం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలనే కేంద్రం లాక్ డౌన్ చేస్తు ఆదేశాలిచ్చింది. ఇందులో తెలంగాణాలోని ఐదు జిల్లాలతో పాటు ఏపిలోని మూడు జిల్లాలున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇప్పటికే కరోనా వైరస్ నియంత్రించటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తాము తీసుకుంటున్న చర్యలను తెలంగాణా సిఎం కేసియార్, ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా ఇప్పటికే వివరించారు.  తెలంగాణాలో స్క్రీనింగ్ చేసిన అనుమానితుల్లో 28 మందికి పాజిటివ్ అంటే వైరస్ ఉందని గుర్తించారు. అదే సమయంలో ఏపిలో ఇప్పటికి 6 మందికి కరోనా వైరస్ ఉందని నిర్ధారణ అయ్యింది.

 

ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలో కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఆందోళనకరంగా ఉంది. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో కూడా విదేశాల నుండి వచ్చిన వారికి అలాగే వారి ద్వారా మాత్రమే ఇతరులకు వైరస్ సోకుతోంది. చాలామంది విదేశాల నుండి వస్తున్న వారు 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉండాల్సుండగా ప్రభుత్వానికి సమాచారం అందించకుండానే ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. అలాగే ఇళ్ళల్లోనే ఉండకుండా జనాల్లో కలిసిపోతున్నారు. ఇదే ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారింది. ఇటువంటి వాళ్ళ వల్లే వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ఒక్క ఆదివారమే తెలంగాణాలో 6 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

 

తెలంగాణాలోని హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాచలం, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు ఏపిలోని ప్రకాశం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. అంటే పై జిల్లాల్లో కేసులు బయటపడటంతో తీవ్రత పెరుగుతుందనే ఆందోళన ప్రభుత్వాల్లో ఉన్నాయి. నిజంగానే రెండోదశ దాటి మూడో దశకు చేరుకుంటే వైరస్ నియంత్రణ చేయిదాటి పోయే ప్రమాదం ఉంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: