కరోనా ఎఫెక్ట్ ఏపి అసెంబ్లీ సమావేశాలపైన కూడా పడేట్లే ఉంది. ఈనెలాఖరులో జరపుదామని అనుకున్న బడ్జెట్ సమావేశాల బదులు ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ ఎకౌంట్ తో సరిపెట్టేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.  ఈనెలాఖరులోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగాలన్న విషయం అందరికీ తెలిసిందే.  బడ్జెట్ సమావేశాలు పెట్టి బడ్జెట్ ను పాస్ చేయకపోతే ఆర్ధిక వ్యవహారాలన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. అందుకనే ఈనెలాఖరులో బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశారు. దీనికి తగ్గట్లే అధికార యంత్రాంగం కూడా రెడీ అవుతున్నారు.

 

అయితే హఠాత్తుగా కరోనా వైరస్ సమస్య తెరమీదకు వచ్చేసింది. కరోనా వైరస్ కారణంగానే పార్లమెంట్ సమావేశాలు కూడా వాయిదా పడ్డాయి. అలాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు కూడా వాయిదా పడిన విషయం అందరూ చూసిందే. ప్రస్తుతం ఏపిలో మెల్లిగానే అయినా వైరస్ సమస్య పెరుగుతోంది. ఇప్పటికి వెలుగు చూసింది ఐదు కేసులే అయినా అనుమానితుల జాబితా పెరుగుతోంది. విదేశాల నుండి ప్రతిరోజు వస్తున్న వేలాదిమందికి ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్టులు చేస్తోంది.

 

ఇప్పటికే దాదాపు 2 వేల మందిని హోం క్వారంటైన్ తో పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచింది. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకునే ఇప్పటికే కేంద్రం ప్రకాశం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలను లాక్ డౌన్ గా ప్రకటించింది. సో వైరస్ సమస్యను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ సమావేశాల స్ధానంలో ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ ఎకౌంట్ ను పాస్ చేసుకుంటే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి తాజాగా అనుకున్నట్లు సమాచారం.

 

గతంలో అంటే 2003లో చంద్రబాబునాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాగే ఓటాన్ ఎకౌంట్ పాస్ చేసుకునేందుకు ఆర్డినెన్స్ ను జారీ చేయించాడు. మీడియా సమావేశంలో కూడా జగన్ మాట్లాడుతూ తప్పని పరిస్ధితుల్లో మాత్రమే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సొస్తోందని అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉన్నతాధికారుల సమీక్షలో ఆర్డినెన్స్ ద్వారా కూడా ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ పాస్ చేయించుకోవచ్చనే చర్చ జరిగిందని సమాచారం. కాబట్టి జగన్ ఏమి నిర్ణయిస్తారో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: