అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ చేసే ప్రసంగంలో ఏమేమి అంశాలు ఉండాలి ? ఏ అంశాలు ఉండకూడదు ? అనే విషయాన్ని ప్రతిపక్షమే డిసైడ్ చేస్తుందా ?  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాటలు వింటుంటే ఇదే అనుమానం వస్తోంది. యనమల వరస చూస్తుంటే ఏకంగా గవర్నర్ నే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉంది.  బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసే ప్రసంగాన్ని ప్రభుత్వమే తయారు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఏదో అసాధారణ పరిస్ధితుల్లో మాత్రమే గవర్నర్ తనిష్టప్రకారం అందులో మార్పులు చేసుకుంటారన్న విషయం కూడా అందరికీ తెలుసు. అదెక్కడ జరుగుతుందంటే ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య సరైన సంబంధాలు లేని రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ తొందరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అంశాలు ఉండకూడదో, అసెంబ్లీ చర్చించాల్సిన అంశాలేమిటో కూడా యనమలే చెప్పేస్తున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావనే ఉండకూడదట. ఒకవేళ ప్రభుత్వం రాసిచ్చినా దాన్ని గవర్నర్ మార్చేయాలట. ఇక్కడే యనమల వార్నింగ్ లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరగాలని కూడా చెప్పేస్తున్నారు. మామూలుగా అయితే అసెంబ్లీ ఎన్ని రోజులు జరగాలి ? ఏ అంశాలు చర్చించాలి ? అనే విషయాలను బిఏసిలో డిసైడ్ చేస్తారు. అలాంటిది స్పీకర్ గా పనిచేసిన యనమల కూడా ఇంత విచిత్రంగా ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు.

 

పంచాయితీ రాజ్ చట్టం ఆర్డినెన్స్ చట్టం, కరోనా వైరస్-ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావం, రాజధాని అమరావతి మార్పు, స్ధానిక సంస్ధల్లో బిసి రిజర్వేషన్ తగ్గింపు, శాసనమండలి రద్దు, ప్రతిపక్షాలకు బెదిరింపులు, అభివృద్ధి కార్యక్రమాల్లో స్తబ్దత, పథకాల్లో కోత, పెట్టుబడుల తరలింపు, యువతకు ఉద్యోగాల కల్పన లేకపోవటం లాంటి అనేక అంశాలు చర్చించాల్సుందట. అంటే యనమల వరస చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి చెప్పినట్లే అధికారపార్టీ నడుచుకోవాలని డిక్టేట్ చేస్తున్నట్లే ఉంది. టిడిపి హయాంలో ఉన్నపుడు ప్రతిపక్షాలు చెప్పినట్లే యనమల నడుచుకున్నారా ?

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: