అథ్లెట్లూ, క్రీడాకారులూ.. ఏదైతే జరగ కూడదని దేవుణ్ణి కోరుకున్నారో సరిగ్గా అదే జరిగి, సదరు ఆటగాళ్లను కలవర పెడుతోంది. ఈ ఏడాది జపాన్‌లో జరగవలసిన ఒలింపిక్స్‌, తాత్కాలికంగా వాయిదా పడిందని, ఇక తమ అథ్లెట్లు.. 2021లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతారని ఆస్ట్రేలియా ఒలింపిక్స్ అధికారులు ప్రకటించారు. దీనిపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు. కానీ... వాయిదా వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. 

 

నిన్న మొన్నటిదాకా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పిన నిర్వాహకులు... కరోనా పుణ్యమాని.. వారం నుంచీ సైలెంట్ అయిపోయారు. ఇక వచ్చే ఏడాది జరపాలా లేక వేరే దేశంలో జరపాలా అన్న అంశంపై సదరు నిర్వాహకులు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రీడల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జపాన్ ప్రభుత్వం మాత్రం వీటిని షెడ్యూల్ ప్రకారమే జరపాలని డిమాండ్ చేయడం గమనార్హం. కాగా... టోక్యో ఒలింపిక్స్‌ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉందన్న విషయం విదితమే.

 

ఇక కరోనా వైరస్ జపాన్‌తో పాటూ 192 దేశాల్లో విస్తరించింది. మొత్తం సిటీలో లాక్ డౌన్లు ఉన్నాయి. విమాన సర్వీసులు సరిగా లేవు. అందుకే ఈ క్రీడలు ప్రస్తుత షెడ్యూల్‌లో నిర్వహించడం కుదరదని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా క్రీడలు రద్దయినందువలన ఒలింపిక్స్ కూడా వాయిదా వేయక తప్పలేదు. ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలు ఇప్పటికే రద్దయ్యాయి. అథ్లెట్ల ట్రైనింగ్ కూడా సాగిన దాఖలాలు కనబడుట లేదు. చాలా దేశాలు వాయిదా వెయ్యమని కోరుతున్నాయి. 

 

ఇక జరిగిన నష్టాన్ని ఒకసారి బేరేజి వేసుకుంటే... రూ. 21,500 కోట్ల స్వదేశీ స్పాన్సర్‌షిప్‌, ఏర్పాట్లపై ఖర్చుపెట్టిన రూ. 90 వేల కోట్లు నష్టపోతామని జపాన్‌ ప్రధాని షింజో అబే అంటున్నారు. ఐతే... ఒలింపిక్స్ అధికారులు వాయిదాకి సంబంధించి మూడు ప్లాన్లను సిద్ధం చేసినట్లు తెలిసింది. క్రీడల్ని రెండు నెలలు వాయిదా వేస్తారని తెలుస్తున్న తరుణంలో... ఆస్ట్రేలియా అధికారులు చేసిన ప్రకటనతో... ఒలింపిక్స్‌ని 2021కి వాయిదా వేస్తారా అన్న సందేహం ఉందనే వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: