దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం లోక్ సభపై కూడా పడింది. ఏప్రిల్ 3 వరకు లోక్ సభ సమావేశాలు జరగాల్సి ఉండగా ఆర్థిక బిల్లు ఆమోదం అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది. ఎంతో కీలకమైన ఆర్థిక బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపి అనంతరం దిగువ సభను వాయిదా వేశారు. 
 
స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశారు. లోక్ సభలో రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 3 వరకు రెండో విడత సమావేశాలు జరగాల్సి ఉండగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో సభను కుదించారు. రాజ్యసభ కూడా పలు అంశాలపై చర్చ అనంతరం వాయిదా పడనుందని తెలుస్తోంది. 2020 - 21 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. 
 
ఆర్థిక, జమ్మూ కశ్మీర్ బిల్లులతో పాటు డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, లద్ధాఖ్ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ సమావేశాలు ముగుస్తాయని సమాచారం. భారత్ లో పలు రాష్ట్రాలపై కరోనా పంజా విసురుతోంది మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 89 నమోదు కాగా తెలంగాణలో 33కు చేరాయి. మహారాష్ట్ర కరోనా విజృంభణతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. 
 
దేశంలో కరోనా మృతుల సంఖ్య 8కు చేరింది. మహారాష్ట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కరోనా స్టేజ్ 3 దిశగా పయనిస్తోందని అన్నారు. కరోనా విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే వేగంగా విజృంభిస్తోందని ప్రకటన చేశారు.  విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారు బయట తిరిగొద్దని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: