అవును. లాక్‌డౌన్ ని లైట్ తీసుకోవద్దు.. బతకాలన్నా, బతికించాలన్నా.. లాక్‌డౌన్ తప్పదు! ఈ మాటలన్నది మరెవరోకాదు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీర్ గారు. నిన్న అనగా ఆదివారం నాడు... యావత్ తెలంగాణ ఒక్కటై, జనతా కర్ఫ్యూను విజయవంతం చేసింది. నిజాయితీగా అందరూ ఇళ్లకే పరిమితమై, కరోనాపై యుద్ధం ప్రకటించారు. ఐతే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను మాత్రం, తెలంగాణ వాసులు లైట్‌గా తీసుకున్నారు. 

 

సోమవారం అనగా, ఈరోజు ఉదయాన్నే రోడ్లపైకి వాహనాలు యథేచ్ఛగా వచ్చేసాయి. గుంపులు గుంపులుగా జనాలు రోడ్ల మీదకు వచ్చారు. ఐదు మంది కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండకూడదని, లేదంటే కరోనా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించినా ప్రజలు దాన్ని విస్మరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకు ట్విటర్ ద్వారా ప్రజలకు మంత్రి కేటీఆర్ గారు సూచన చేశారు. లాక్‌డౌన్ అనేది చాలా అరుదుగా ప్రకటించే చర్య అని.. ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక వున్న పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

 

 

ఇక మనం బతకాలన్నా, ఎదుటివారిని బతికించాలన్నా.. స్వీయ క్రమశిక్షణ తప్పనిసరని, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం నుంచి కఠినమైన చర్యలు చేపట్టింది. రోడ్లపై బస్సులు, ఆటోలు, క్యాబ్స్‌‌, బైక్స్, కారు వంటి ప్రైవేట్ వాహనాలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. 

 

ఒకవేళ, అవసర నిమిత్తము, బయటకు వచ్చినా.. ఇంటి నుంచి కి.మీ. పరిధి వరకు మాత్రమే.. అనుమతి ఉంటుందని పోలీసులు ఖచ్చితంగా తెలిపారు. కేవలం నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే బయటకు రావాలని, అనవసరంగా అయితే అసలు రావద్దని ఈ సందర్భంగా  సూచించారు. నిబంధనలను విస్మరించిన యెడల, భారీగా చలాన్లు విధిస్తామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: