ప్రపంచ మహమ్మారిగా పిలవబడుతున్న కరోనా వైరస్, మన దగ్గర వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ, జనతా కర్ఫ్యూకు జనమంతా మద్దతు పలికినప్పటికీ, మరుసటి రోజు నుంచి సాధారణంగా రోడ్లపై తిరగడం మొదలు పెట్టారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ అయిన సంగతి తెలిసినదే. ప్రధాని మోదీ కూడా దీనిపై కోసేపటి క్రితం మెసేజ్ చేశారు. ఇక హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర  జిల్లాల్లోనూ జనం ఇదే రకంగా బాధ్యతా రహిత్యంగా రోడ్లపైకి వస్తున్నారు.

 

దీనిపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి విదితమే. ఈ విషయమై, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు కూడాను. అలాగే ఈ పరిస్థితిపైన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కారులో వున్న అతను, రోడ్డుపైకి సైతం వచ్చి వాహనదారులపై తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్‌డౌన్ అని ప్రకటించినా, బాధ్యతారాహిత్యంగా రోడ్లపైకి ఎలా వస్తారని వాహనదారులపై అయన అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో కారు వద్దకు స్వయంగా వెళ్లి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు... అని అందులోని ప్రయాణికులను ప్రశ్నించడం విశేషం. ఓ దశలో అయితే, తీవ్రమైన అసహనానికి గురైన కలెక్టర్ వాహనదారులను తీవ్రస్థాయిలో తిట్టేశారు. ఎవరూ రోడ్లపైన ప్రయాణించడానికి వీలులేదని, తక్షణం వెనక్కి వెళ్లిపోయి ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. 

 

ఎంత చెప్పినా వినని వారి వద్ద నుంచి కార్లు, బైకులు సీజ్ చేసి, లాక్‌డౌన్ ముగిశాక అప్పగిస్తామని తెగేసి చెప్పారు. లాక్‌డౌన్‌లో భాగంగా బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు. ఇక వాహనాల ద్వారా దూర ప్రయాణాలు కూడా చేసేందుకు వీలు లేదు. కేవలం మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అనుమతి ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: