ప్రపంచవ్యాప్తంగా జనాలందరినీ భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రస్తుతం దేశాలకు దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మన భారత దేశంలోనే దాదాపు 13 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక పంజాబ్ మరియు మహారాష్ట్ర అయితే పూర్తిగా కర్ఫ్యూ విధించారు. అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేశారు మరియు పొరుగు దేశాల మధ్య సంబంధాలు కట్ అయిపోయాయి. మాతృ దేశాలకు వెళ్ళలేక అనేకమంది దేశం కాని దేశంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

 

ప్రపంచం మొత్తం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే విపత్కర పరిస్థితిలో జరగబోయే దారుణాల గురించి ముందుగానే ఊహించిన ఇరాన్ ప్రభుత్వం వేలాది మంది ఖైదీలను ఇప్పటికే బయటికి వదిలి వేసింది. అయితే ఇదే క్రమంలో కొలంబియా రాజధాని బోగోటా జైల్లో ఖైదీలు తమను కూడా వదిలి వేయాలని తిరుగుబాటు చేశారు. ఘటనలో 23 మంది మరణించగా మరో 83 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణామంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

 

లా మోడెలో జైలులో పరిశుభ్రత లేదని అందువల్ల తమకు కరోనా సోకే అవకాశం ఉందని ఖైదీలు ఆరోపించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. జైలు అధికారులపై తిరగబడటమే కాకుండా.. అక్కడ ఉన్న సామాగ్రికి నిప్పుపెట్టారు. సందర్భంగా జరిగిన ఘర్షణలో 23 మంది మృతిచెందారు. ఘటనపై న్యాయశాఖ మంత్రి కాబెలో మీడియాతో మాట్లాడుతూ.. అసలు జైలులో పారిశుధ్యం విషయంలో సమస్యా లేదని.. కరడు కట్టిన నేరస్థులు వారికి విధించిన శిక్షను తప్పించుకునేందుకు వేసిన పన్నాగం ఇది అని వివరించారు. ప్రస్తుతం 32 మంది ఖైదీలు, ఏడుగురు భద్రతా సిబ్బంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: