క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులు వరుసగా జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేయటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా వీళ్ళిద్దరు చంద్రబాబుకు సన్నిహితులు కావటమే కాకుండా టిడిపి హయాంలోనే నియమితులవ్వటం గమనార్హం.  మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి హయాంలో నియమితులైన వారిలో చాలామంది రాజీనామాలు చేసినా రాజ్యాంగ రక్షణలో ఉన్న ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపిపిఎస్సీ ఛైర్మన్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ పదవుల్లోనే కంటిన్యు అవుతున్నారు.

 

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి  అనేక సంక్షేమ పథకాలను అమలు చేయటం ద్వారా జనాలకు దగ్గరయ్యేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు వీళ్ళని మరింతగా రెచ్చగొడుతోంది. వివిధ వర్గాలను జగన్ కు వ్యతిరేకంగా రెచ్చగొడదామని ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం కనబడలేదు. ఏమి చేయాలో దిక్కుతోచని స్ధితిలో ఉన్న చంద్రబాబుతో పాటు ఆ సామాజికవర్గానికి స్ధానికసంస్ధల ఎన్నికలు ఓ ఆయుధంగా దొరికింది. ఎన్నికలప్రక్రియ మొదలైన దగ్గరనుండి వైసిపి నేతలపై టిడిపి వరుసబెట్టి ఆరోపణలు చేస్తునే ఉంది.  

 

పార్టీలోని సీనియర్ నేతలు కూడా పట్టించుకోని ఎన్నికల గొడవలను చంద్రబాబు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి  జగన్ పై ఆరోపణలు చేస్తు  యాగీ చేస్తున్నాడంటే ఏమిటర్ధం ?  ఇక్కడ విషయం ఏమిటంటే రాజకీయంగా జగన్ ను తాను ఏమీ చేయలేనని  చంద్రబాబుకు అర్ధమైనట్లుంది. అందుకనే నిమ్మగడ్డను రంగంలోకి దింపినట్లు అనుమానంగా ఉంది. ఇపుడు జగన్-నిమ్మగడ్డ మధ్య వివాదాలు ఎంత సంచలనమయ్యాయో అందరు చూస్తున్నదే.

 

ఇదే సమయంలో ఏపిపిఎస్సీ ఛైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ కూడా జగన్ కు వ్యతిరేకంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయటం గమనార్హం. చంద్రబాబు హయాంలోనే నియమితులైన ఈయనపై అప్పట్లోనే చాలా ఆరోపణలు వినిపించాయి. నిరుద్యోగులు ఎన్నిసార్లు ఏపిపిఎస్సీ కార్యాలయం ముందు ధర్నా చెశారో లెక్కేలేదు. అలాగే ఉదయ్ ను తప్పించాలంటూ పిడిఎఫ్ ఎంఎల్సీలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు.  జగన్ ప్రభుత్వంపై పిన్నమనేని కూడా బురద చల్లేందుకు బాగానే ప్రయత్నం చేశాడు.

 

చంద్రబాబు  సామాజికవర్గానికి చెందిన వీళ్ళిద్దరు జగన్ పై అదే పనిగా ఆరోపణలు చేస్తుండటంతో చంద్రబాబే వీళ్ళతో ఆరోపణలు చేయిస్తున్నట్లు అనుమానంగా ఉంది. అంటే తన సామాజికవర్గంలోని ప్రముఖులను మరింత మందిని జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు రంగంలోకి దింపబోతున్నట్లు అనుమానిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: