తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు కొత్తగా మూడు కేసులు నమోదు కాగా సాయంత్రం లోపు మరో మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ రోజు మొత్తం ఆరు కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు 33 కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. మధ్యాహ్నం వరకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించిన వ్యక్తులలో ఇద్దరికీ ట్రావెలింగ్ హిస్టరీ ఉండగా... కరీంనగర్ జిల్లాకు చెందిన ఒకరు మాత్రం ఇండోనేషియా వ్యక్తులకు దగ్గరగా మెలగడం వలన ఈ కరోనా వైరస్ సోకింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో విదేశీయులు కాకుండా స్థానిక ప్రజలైన ఇద్దరికి కరోనా వైరస్ సోకింది.



మరోవైపు పోలీసు శాఖలో పనిచేసే డిఎస్పి స్థాయి అధికారి యొక్క 23ఏళ్ల కుమారుడు మార్చి 18న లండన్ నుండి స్వదేశానికి తిరిగివచ్చాడు. మొదటిగా హైదరాబాదు చేరుకున్న అతడు... ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తన నివాసానికి వెళ్లి మార్చి 20 వరకు తన బంధువులు, స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపాడు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం... విదేశాల నుండి వచ్చిన వారెవరైనా తప్పనిసరిగా క్వారంటైన్ కేంద్రానికి వెళ్లి కరోనా వైరస్ టెస్టులు చేయించుకోవాలి. కానీ ఆ నిబంధనను ఇష్టారాజ్యంగా ఉల్లంగిస్తూ బంధు మిత్రులను కలిసాడు ఈ 23ఏళ్ల యువకుడు. ఐతే మార్చి 20వ తేదీన ఈ యువకుడికి తీవ్రంగా దగ్గు, జలుబు, జ్వరం రావడంతో కరోనా వైరస్ తాకింది అనే అనుమానంతో... కుటుంబ సభ్యులు అతన్ని అంబులెన్స్ లో హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించగా... ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు చేసి నమూనాలను పూణే ల్యాబ్ కి పంపించారు.





పూణే ల్యాబ్ లో నమూనాలను పరీక్షించగా... ఈ పోలీసు అధికారి కొడుకుకి కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. దాంతో అతనితో కాంటాక్ట్ లో ఉన్న కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను హైదరాబాద్ కు తరలించి పరీక్షలు చేస్తున్నారు వైద్యాధికారులు. ఇకపోతే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి... కుమారుడి కి వెంటనే పరీక్షలు చేయించకుండా ఆలస్యం చేసినందుకు గాను సదరు డిఎస్పి పై కేసు నమోదు చేస్తామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: