జగన్ కి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి, ఆయన రాజకీయ విలాసం, వైభోగం అంతా కేరాఫ్ వైఎస్సార్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే వైఎస్సార్ చనిపోయి జనం గుండెల్లో దేవుడుగా నిలిచారు. ఆయన వారసుడుగా జగన్ జనంలో నిలబడ్డారు. తండ్రి ఆస్తిగా జనాన్ని సమీకరించుకోవడంలో మాత్రం జగన్ దే విజయం.

 

అయితే జగన్ తండ్రి సన్నిహితులను మాత్రం తనతో పాటు కలుపుకోలేకపోయారు. వైఎస్సార్ ఆత్మగా ఉన్న కేవీపీ రామచంద్రరావు, ఆయనకు అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు జగన్ కి ఇప్పటికీ దూరమే. వారు ఎందుకు అలా ఉన్నారో ఎవరూ చెప్పలేరు. అయితే జగన్ కి ఇది మంచి ఇది చెడ్డా అని చెప్పడంలో కేవీపీ, ఉండవల్లి ఎప్పటికపుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో కొంత కటువుగా అయినా ఉండవల్లి తాను చెప్పాల్సింది  చెప్పేస్తారన్న మాట ఉంది.

 

ఇపుడు ఆయన తాజాగా ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ని బాగా తప్పుపట్టారు. ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉండి ఒక సామాజికవర్గం అంటూ అధికారిని కించపరచడం మంచిది కాదంటూ గట్టిగానే తగులుకున్నారు. ఇది ముమ్మాటికీ జగన్ చేసిన తప్పేనని కుండబద్దలు కొట్టారు. ఇక జగన్ పాలనాపరంగా చేస్తున్న తప్పుల వల్ల ఆయన ఇబ్బందుల్లో పడతారని కూడా జోస్యం చెప్పేశారు.

 

జగన్ తప్పులకు ఏ ఒక్కరోకాదు ఆయనే బాధ్యత వహించాలని కూడా  పక్కా క్లారిటీగా ఉండవల్లి అంటున్నారు. జగన్ పార్టీకి ఆయనే హై కమాండ్ కాబట్టి ఆయనే  పాపాలను మోసే భైరవుడి అవతారం ఎత్తకతప్పదని కూడా అంటున్నారు. ఇక జగన్ విషయంలో ఆయన మరో మాట అన్నారు. టీడీపీ నుంచి మనుషులను తెచ్చుకున్నంతమాత్రాన వైసీపీ బలం పెరగదని, చంద్రబాబు ఇమేజ్ జనంలో ఒక్కసారి పెరిగితే ఈ నాయకులే వెనక్కి వస్తారని కూడా ఉండవల్లి అంటున్నారు.

 

అన్నింటికీ మించి ఉండవల్లి మరో మాట చెబుతున్నరు. జగన్ ఏడాది పాలను జాగ్రత్తగా గమనిస్తున్నానని, వాటి మీద తన అభిప్రాయాలను కచ్చితంగా తొలి ఏడాది పూర్తి అయిన నాడే  బయటపెడతానని అంటున్నారు. అంటే జగన్ పాలన మీద చార్జిషీట్ వేయబోయేది ఎవరో కాదు వైఎస్సార్ ప్రియ శిష్యుడు ఉండవల్లి అన్నమాట. చూడాలి ఆయన ఎన్ని హాట్ కామెంట్స్ చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: