ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో మరో పథకం అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఉన్నత విద్యాశాఖ జగనన్న విద్యా దీవెన పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్థులైన విద్యార్థులందరికీ లబ్ధి చేకూరనుంది. 
 
విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలలో కాలేజీలు ఫీజుల విషయంలో రాష్ట్ర నియంత్రణ కమిషన్, ఉన్నత విద్య పర్యవేక్షణకు అంగీకరించి ఉండాలి. విద్యార్థుల నుంచి డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులను వసూలు చేయరాదు. కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. సంస్థ నిర్వహణలో లాభాలను సంస్థ కోసమే వెచ్చించాలి. రీయింబర్స్‌మెంట్‌ నిధుల పేరు చెప్పి విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయరాదు. 
 
కాలేజీలు విద్యార్థుల అకడమిక్ పెర్ఫామెన్స్, ఇతర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలి. ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలి. యూజీసీ, ఏఐసీటీఈ, ఇతర సంస్థల నిబంధనలకు అనుగుణంగా కాలేజీలను నిర్వహించాలి. ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు ద్వారా విద్యార్థుల, బోధన, బోధనేతర సిబ్బంది హాజరు నమోదు చేయాలి. 
 
కాలేజీలు ప్రభుత్వం అనుమతించే కోర్సులతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిర్దేశించిన కోర్సులనే నిర్వహిస్తూ ఉండాలి. నిబంధనలు పాటించని కాలేజీలను ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నుండి తప్పిస్తుంది. విద్యార్థులకు 75 శాతం కన్నా హాజరు తగ్గితే పథకం వర్తించదు. ప్రైవేట్ వర్సిటీలకు, డీమ్డ్ వర్సిటీలకు ఈ పథకం వర్తించదు. ఈ పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ విభాగంగా పని చేస్తుంది. దూర విద్య, కరస్పాండెన్స్ కోర్సులు చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాదు. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: