ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటివరకూ 3 లక్షల మందికి పైగా కరోనా మహమ్మారి సోకింది. మరణాలు 13వేలకు చేరువలో ఉన్నాయి. ఇటలీలో మరణాల సంఖ్య చైనాను దాటిపోయింది. స్వీయనియంత్రణ ద్వారానే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉంటుందని, ప్రజలందరూ ఇందుకోసం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.

 

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. చైనాలో ఇప్పటివరకూ 81వేల మంది ఈ వైరస్ బారిన పడి 3వేల 2వందల మందికిపైగా చనిపోయారు. డ్రాగన్ కంట్రీ నుంచి  ఇటలీలో ప్రవేశించిన ఈ వైరస్.. ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకూ 53 వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.  చైనాను మించి ఇక్కడ 4 వేల 5 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ను తేలిగ్గా తీసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆ దేశ ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలున్నాయి. చైనా, ఇటలీ తర్వాత స్పెయిన్, ఇరాన్, జర్మనీ, అమెరికాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆ దేశాల్లో 20వేల మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు.

 

ఇటలీలో శనివారం ఒక్కరోజే 793 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన మరణాల్లో 36 శాతం ఇటలీలోనే సంభవించాయి. దీంతో ఆ దేశం మరిన్ని ఆంక్షలను అమలు చేస్తోంది. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్‌ ధాటికి స్పెయిన్‌ కూడా విలవిల్లాడుతోంది. ఇప్పటివరకూ 25 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. 14 వందల మందికి పైగా చనిపోయారు. ఇరాన్‌లో మరణాల సంఖ్య 16 వందలకు చేరువైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు జైళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా మరో 10 వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేస్తున్నారు. 

 

అమెరికాలో సుమారు 22 వేల మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇప్పటివరకూ 288 మందికి పైగా చనిపోయారు.   మరోవైపు మూడ్రోజుల్లోనే కొత్తగా 10వేల మందికి ఈ వైరస్‌ సోకడంతో అమెరికా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. ప్రజారవాణాపై కూడా ఆంక్షలు విధించారు.

 

ఫ్రాన్స్‌లో కూడా తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటివరకూ సుమారు 12 వేల మందికి వైరస్ సోకగా.. 450 మందికి పైగా చనిపోయారు. 24 గంటల్లో 78 మంది చనిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే టెస్టింగ్‌ కిట్ల కొరత ఈ దేశాన్ని వేధిస్తున్నట్టు సమాచారం. దాయాదిదేశం పాకిస్తాన్‌లో కరోనా దాటికి ముగ్గురు మరణించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాలని కోరింది. 45 రోజులపాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. మరోవైపు జింబాబ్వేలో తొలి కరోనా కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: