గోవింద నామ స్మరణతో మారుమ్రోగే సప్తగిరులు... ఇప్పుడు మూగబోయాయి. అక్కడ కనీవినీ ఎరగని పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్‌ కారణంగా భక్తులకు స్వామి దర్శనం నిలిపివేయడంతో అంతా నిశబ్ద వాతావరణం నెలకొంది. ఎక్కడా భక్తుల సందడి కనపించడం లేదు. 

 

అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడి సన్నిధిలో ఇప్పుడు సరికొత్త వాతావరణం కనిపిస్తోంది. లక్షలాది మంది భక్తులతో సందడిగా వుండే శ్రీవారి కొండల్లో భక్తుల కోలాహలం మాయమైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు... తెలుగు రాష్ర్టాల్లోనూ కరోనా భయం ఎక్కువైంది. అందుకే, ప్రభుత్వ సూచనలతో ఈనెల 20 నుంచి శ్రీవారి ఆలయంలో అన్ని దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో తిరుమల నిర్మానుష్యంగా మారింది. ఘాట్ రోడ్డులో వాహనాలు తిరగట్లేదు. రెండు నడకమార్గాలూ మూతపడ్డాయి. 

 

ప్రతిరోజూ 420 ఆర్టీసీ బస్సులు కొండమీదకు 1650 ట్రిప్పులేస్తుంటాయి. 8 వేల వరకు  కార్లు, జీపులు... 5 వేల వరకు ద్వీచక్రవాహనాలు సంచరించే ఘాట్ రోడ్డులో ఇప్పుడు పట్టుమని 100 వాహనాలు కూడా తిరగడం లేదు. భక్తులు వేచి వుండే క్యూ లైన్లలో నిశ్శబ్ధం ఆవహించింది. స్వామికి వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట.. కళ తప్పింది. 

 

పుష్కరిణి లో స్నానం.... వరాహ వెంకటేశుడి దర్శనం... మహాప్రసాదం స్వీకరణ.... ఇదీ తిరుమల క్షేత్రంలో అనుసరించవలసిన దర్శనవిధానం. 365 పుణ్యతీర్దాలు అయిన శ్రీవారి పుష్కరిణిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ వుంటారు. ఇప్పుడక్క నీటి సవ్వడి తప్ప... మరేమీ వినిపించడం లేదు. 

 

ఆలయంలో స్వామివారికి పూజా కైంకర్యాలు సైతం ఏకాంతంగా సాగుతున్నాయి.  ఉదయం 3 గంటలకే స్వామివారికి సుప్రభాతసేవను ప్రారంభిస్తూ.... రాత్రి 8 గంటలకే ఏకాంత సేవను నిర్వహిస్తున్నారు. దీంతో ఏడుకొండల వాడికి.. ఇప్పుడు దాదాపు 7 గంటల ఏకాంతసమయం లభిస్తోంది. ఇప్పటికే, లడ్డు ప్రసాదం తయ్యారిని నిలిపివేసింది టిటిడి. సాధారణంగా ప్రతిరోజూ 3 నుంచి మూడున్నర లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తారు. కానీ ఇప్పుడు శ్రీవారికి నైవేధ్యంగా సమర్పించే దిట్టం వరకే ప్రసాదాలను తయారుచేస్తున్నారు. ఎంత మంది భక్తులొచ్చినా సరే.. నిరంతరం అన్నప్రసాద వితరణ జరిగే తరిగోండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రం ఇప్పుడు నిర్మానుష్యమైంది. 

 

మొత్తంగా లక్షమంది భక్తులు సంచరిస్తూ హడావుడిగా వుండే ఆ సప్తగిరులను నిశ్శబద్దం ఆవహించింది. కరోనా ప్రభావంతో.. భక్తులు సందడితో కిటకిటలాడే దేవదేవుడి సన్నిధి.. చిన్నబోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: