ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తగ్గించే ప్రయత్నంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.  ఇప్పటికే ఈ భూతానికి పదిహేనువేల మంది బలి అయ్యారు.  మూడు లక్షల మంది ఈ కరోనా భారిన పడ్డారు.. ఇంకా ఈ సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  అయితే కరోనా పేరు చెప్పి కొంత మంది అమాయకులను దారుణంగా మోసం చేస్తున్న సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా వేప చెట్టుకి నీళ్లు పోస్తే కరోనా తగ్గిపోతుందని గ్రామాల్లో పుకార్లు మొదలయ్యాయి.  ఒకరు, ఇద్దరు కుమారులున్న తల్లులు ఐదు ఇళ్ల నుంచి నీటిని సేకరించి ఆ నీటిని వేపచెట్టుకు పోస్తే కరోనా వైరస్ దరిచేరదన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇంకేముందు తమ పిల్లలు క్షేమంగా ఉండాలని ఆ కన్నతల్లులు బిందెలతో వేప చెట్టు ఎంత దూరం ఉన్నా అక్కడికి వెళ్లి నీళ్లు పోస్తున్నారు.  

 

ఇదో తిరనాళ్లలా సాగుతుంది.. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అక్కడ పూజలు చేయాలంటూ కొబ్బరికాయలు అమ్ముతూ అడ్డగోలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.  ఒక కొడుకు ఉన్నవారు ఒక కొబ్బరికాయ, ఇద్దరున్నవారు రెండు కొబ్బరికాయలు వేపచెట్టుకు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నమ్మకంపై జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు స్పందించారు.  ఇలా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా వేప చెట్లకే దండాలు పెడతారు.. ఇన్ని కోట్ల నష్టం ఎందుకు వాటిల్లుతుందని అంటున్నారు. 

 

వేప చెట్టు  ఔషద గుణం ఉన్నదే కానీ.. నీళ్లు పోస్తే పిల్లలకు కరోనా రాదని చెప్పలేం అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలతో వైరస్‌ను కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇళ్లలోంచి బయటకు రాకపోవడమే కరోనా వైరస్‌కు సరైన మందు అని పేర్కొన్నారు. లేనిపోని నమ్మకాలతో వేలంవెర్రిగా రోడ్లపైకి రావొద్దని సూచించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: