దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటివరకూ 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరికొన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు మాత్రం ప్రభుత్వ నిబంధనలను లెక్క చేయడం లేదు. 
 
ప్రజలు వైరస్ ప్రభావాన్ని అంచనా వేయకుండా రోడ్లపైకి వస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి వాహనాలతో జనం రోడ్లపైకి వచ్చేశారు. అధిక సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో దాదాపు రెండు గంటలుగా అక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ట్రాఫిక్ జామ్ లో అత్యవసర సేవల ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. అధిక సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. 
 
కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం అత్యవసర సేవలు అందించే వారు మాత్రమే రోడ్లపైకి రావాలని సూచించింది. ప్రజలు మాత్రం ప్రభుత్వ, పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వాహనాలతో రోడ్లపైకి చేరుకుంటున్నారు. ఎర్రగడ్డలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నా ప్రజలు కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 
 
ఏసీపీ స్థాయి అధికారులు ఎర్రగడ్డకు చేరుకుని వాహనాలను తిప్పి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఫేక్ ఐడీ కార్డులను పోలీసులకు చూపిస్తూ రోడ్లపై ప్రయాణం చేస్తున్నారని సమాచారం. పోలీసులు మాట్లాడుతూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. కొంతమంది వాహనదారులను వెనక్కు పంపిస్తున్నామని చెప్పారు. మెడిసిన్స్ కొరకు చాలామంది రోడ్లపైకి వస్తున్నారని... వారికి మాత్రం అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు.                            

మరింత సమాచారం తెలుసుకోండి: