కరోనా నియంత్రణపై సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయని, కేవలం లాక్‌డౌన్‌తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని చెప్పారు. ప్రజారోగ్య చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విదేశాల నుంచి ఏపీలోకి 15వేల మంది వచ్చారని సమాచారం ఉందని పేర్కొన్నారు. వారందరికీ కట్టుదిట్టంగా క్వారంటైన్‌ అమలు చేయాలన్నారు. కరోనా సోకినవారి కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నారు.  గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు.

 


ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని, మార్కెట్‌లో నిత్యావసర ధరలను కట్టడి చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  అయితే, చంద్ర‌బాబు అనూహ్యంగా రాసిన ఈ లేఖ వెనుక రెండు కార‌ణాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. ఒక‌టి వ్యూహాత్మ‌కం. రెండు రాజ‌కీయం. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం జ‌గ‌న్‌.. లాక్‌డౌన్ కార‌ణంగా.. నిత్యావ‌స‌రాల‌ను ఫ్రీగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.



అదే స‌మ‌యంలో ప్ర‌తి రేష‌న్ కార్డు దారునికి కూడా రూ.1000 అందిస్తామ‌ని చెప్పారు. అయితే, ఈ నిర్ణ‌యాన్ని హైజాక్ చేసేలా చంద్ర‌బాబు తొలి నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిలో ఏకంగా ఆయ న రూ.ఐదు వేలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. వాస్త‌వానికి ఆదాయం బాగున్న తెలంగాణ‌లోనే పేద‌ల‌కు రూ.1500 ఇచ్చి స‌రిపెడుతున్నా.. అక్క‌డ అడ‌గ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం ఐదు వేలు ఇవ్వాల‌ని అంటున్నారు. ఇది వ్యూహాత్మ‌కంగా ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్ట‌డం.



ఇక‌, ఇంత క‌ష్ట కాలంలో ప్ర‌జ‌ల త‌ర ఫున ఏదో ఒక‌టి తాను చేయాలి కాబ‌ట్టి ఈ లేఖ ద్వారా ఆయ‌న స‌రిపెట్ట‌డం రాజ‌కీయ కోణం. అంటే ప్ర‌జల కోసం ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా తాను స్పందించాన‌ని ఉదారంగా నిధులు ఇవ్వాల‌ని సూచించాన‌ని ఆయ‌న రేపు చెప్పుకొనేందుకు అవ‌కాశం క‌ల్పించుకున్న‌ట్ట‌యింది. మొత్తానికి జ‌గ‌న్‌కు బాబు లేఖ వెనుక వ్యూహం+ రాజ‌కీయం రెండూ ఉన్నాయ‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: