ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో పదో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటం.... లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాత ప్రభుత్వం కొత్త పరీక్ష తేదీలను ప్రకటించనుందని సమాచారం. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ప్రభుత్వం మొదటిసారి ప్రకటించిన షెడ్యూల్ లో మార్పులు చేసి మార్చి 31కు పరీక్షలు వాయిదా వేసింది. పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వార్తలు వినిపించినా జగన్ యథాతథంగా నిర్వహిస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించారు. 
 
కానీ రోజురోజుకు కరోనా పంజా విసురుతుండడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా విద్యార్థులకు పరీక్షలకు ప్రిపేర్ కావడానికి మరింత సమయం లభించనుంది. ఏపీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రాయలసీమలో కరోనా ప్రభావం లేకపోయినా వైజాగ్, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో పాటు, పలు ఇబ్బందులు ఉండటంతో జగన్ అధికారులతో చర్చించి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం 13 జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఈరోజు నుండి రాష్ట్రంలో జిల్లా సరిహద్దులను మూసివేశారు. పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుండి హర్షం వ్యక్తమవుతోంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: