ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నేరుగా ఇళ్ల వద్దకే అందించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన జీవో జారీ అయింది. ప్రభుత్వం మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనుంది. వాలంటీర్లు వారికి కేటాయించిన 50 ఇళ్లలోని పిల్లలకు భోజనం అందించనున్నారు. 
 
ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా బియ్యం, చిక్కీ, కోడిగుడ్లను ఇళ్ల దగ్గర పంపిణీ చేయనుందని సమాచారం. విద్యార్థులకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు వాలంటీర్లు విద్యార్థులకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించింది. 
 
మధ్యాహ్న భోజనం లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మార్చి 31వ తేదీ నుండి జరగాల్సిన ఈ పరీక్షలకు కొత్త డేట్లను ప్రకటిస్తామని పేర్కొంది. 
 
ఏపీలో ఇప్పటివరకూ 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా అనుమానితులకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు సమాచారం అందుతోంది. పోలీసులు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా తగిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు సూచించారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: