ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడచిన మూడు నెలలుగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందని అన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ముందుజాగ్రత్తచర్యలు చేపట్టామని వ్యాఖ్యానించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. 
 
రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. కరోనాపై ప్రభుత్వం ముందునుంచి అప్రమత్తంగా ఉండటం వల్లే ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో తక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కరోనా ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మనం ఇంటికే పరిమితం కావడం, కొత్త వ్యక్తులను కలవకపోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. 
 
సీఎం జగన్ రెండు రోజుల క్రితం మన ఇంట్లో పెద్దలను, వృద్ధులను కాపాడుకోవాలంటే వారిని, 10 ఏళ్ల లోపు పిల్లలను ఇళ్లకే పరిమితం చేయాలని సూచించారని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్రంలో కఠిన చర్యలు చేపడుతూ ఉండటంతో కొంత మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ జనం స్వచ్చందంగా ముందుకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తగిన జాగ్రత్తలు వహించకపోతే వ్యాధి భారీన పడే అవకాశాలు ఉంటాయని చెప్పారు. 
 
ప్రధాని మోదీ బ్రహ్మాండమైన ఉద్దేశంతో జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని... ఉదయం నుండి సాయంత్రం వరకు కర్ఫ్యూ పాటించిన ప్రజలు... సాయంత్రం గుంపులుగుంపులుగా చేరి సంబరాలు చేసుకోవడం వల్ల కర్ఫ్యూ పాటించి ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులు ఇంటి నుండి బయటకు వస్తే ప్రమాదమని వారికి సెలవులు ప్రకటించామని వారిని ఇంటికే పరిమితం చేయాలని సూచించారు. మరోవైపు ఏపీలో నిన్నటివరకూ ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ముందుజాగ్రత్తచర్యలు చేపట్టటంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: