దేశంలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు బాధితుల సంఖ్య 536కు చేరింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ వివరాలను ధ్రువీకరించాల్సి ఉంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి 40 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా దేశంలో 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. తెలంగాణలో ఇప్పటివరకూ 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 7 కేసులు నమోదయ్యాయి. 
 
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించినా పలు ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఏపీ మంత్రి పేర్ని నాని ప్రజలు అనవసరంగా బయటకు వస్తే సెక్షన్ 158 కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 330 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 
 
256 వాహనాలను సీజ్ చేశామని... ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లకుండా చర్యలు చేపట్టామని అన్నారు. రైతు బజార్లలో సామాజిక దూరం పాటించి కూరగాయలు కొనుగోలు చేయాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 
 
కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది, కేసీఆర్ లాక్ డౌన్ పరిస్థితుల గురించి, కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రధానంగా చర్చించారని సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఅర్ మరికాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. సీఎం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: