జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయాన్ని  జాతీయ మీడియా  బాగా హైలైట్ చేస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్ధే. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో ప్రస్తుతం గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ గురించి బాగా జగన్ ను అభినందిస్తు జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు ఇచ్చాయి. బిజినెస్ లైన్, ఔట్ లుక్ ఇండియా, ఏఎన్ఐ, బిజినెస్ స్టాండర్డ్, లేటెస్ట్ లి తో పాటు కొన్ని తమిళ ఛానళ్ళు గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ గురించి ప్రత్యేక కథనాలు ఇవ్వటమే ఆశ్చర్యం.

 

జగన్ అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ ఏర్పాటు చేశాడు. 2.5 లక్షల మంది నిరుద్యోగులను ఈ వ్యవస్ధ పరిధిలోకి ఉద్యోగులుగా తీసుకొచ్చాడు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ను కేటాయించాడు.  ఆ 50 ఇళ్ళకు రేషన్ తో పాటు ఫించన్ సక్రమంగా అందించే బాధ్యత వాలంటీర్లదే.  ఇలా ప్రతిరోజు లేదా వారానికి ఓసారి వాళ్ళతో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతుండటంతో మొత్తం 50 ఇళ్ళలోని సభ్యులతో వాలంటీర్లకు బాగా పరిచయాలు అయిపోయాయి.

 

ఆ పరిచయాలే ఇపుడు కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించటంలో తోడ్పడుతోంది. విదేశాల నుండి ఎవరు వచ్చినా వాలంటీర్లకు ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. విదేశాల నుండి వచ్చిన వాళ్ళ ఇంటి సభ్యులు సమాచారం ఇవ్వకపోయినా చుట్టు పక్కల వాళ్ళు ఫోన్లు చేసి మరీ సమాచారం అందించేస్తున్నారు. దాంతో వాలంటీర్ నేరుగా వాళ్ళింటికి వైద్యాధికారులను తీసుకెళ్ళి స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నారు.

 

ఈ విధంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు సుమారు 1.43 కోట్ల ఇళ్ళను సర్వే చేశారు. అంటే ఇంత పకడ్బందీ వ్యవస్ధ దేశంలోని మరే రాష్ట్రంలోను లేదనే చెప్పాలి. ఈ వాలంటీర్లే లేకపోతే విదేశాల నుండి వచ్చిన వాళ్ళ సమాచారం ప్రభుత్వానికి తెలియటానికి చాలా ఇబ్బందయ్యేదే. వీళ్ళ వల్లే సుమారు 20 వేల మంది విదేశీయులను స్క్రీనింగ్ పరీక్షలకు తీసుకెళ్ళారంటే ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యవస్ధ పనితీరుపైనే పై మీడియా సంస్ధలు బ్రహ్మాండంగా కథనాలు అందించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: