తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూటిగా, స్ప‌ష్టంగా చెప్పేశారు. హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ మ‌నం చాలా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఉన్నాం...సాధార‌ణ ప‌రిస్థితుల‌కు చేరుకోవాలంటే అంద‌రం ఒక్క‌తాటిపై న‌డ‌వాల‌ని, దీనికి ఎంతో ఒర్పు, నేర్పు అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 36 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లుగా తెలిపారు. ప్ర‌స్తుత‌మున్న వారికి మెరుగైన చికిత్స అందుతోంద‌ని అన్నారు. వారంతా ఏప్రిల్ 7త‌ర్వాత డిశ్చార్జి అవుతారంటూ తెలిపారు. అయితే ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని స్ప‌ష్టం చేశారు.

 

తెలంగాణ‌లో ప‌రిస్థితులేం బాగోలేవ‌ని చెప్పారు. చాలామందిపై ఇప్ప‌టికే నిఘా ఉంచామ‌ని తెలిపారు. దాదాపు 19వేల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే క‌రోనా అనేది వేగంగా వ్యాప్తిచెందే వ్యాధ‌ని ఒక్క‌రి నుంచి వెయ్యి మంది వ‌ర‌కు కూడా పాకే ల‌క్ష‌ణం ఉంద‌ని తెలిపారు. అందుకే ప్ర‌భుత్వం ప‌దేప‌దే ప్ర‌జ‌ల‌కు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతోంద‌ని అన్నారు. ఇప్ప‌టికి మాట విన‌క‌పోతే మాత్రం ప‌రిస్థితి ఆర్మీ, ప్ర‌త్యేక బ‌లగాల‌ను దించే స్తాయికి వెళ్తుంద‌ని, అప్పుడు షూట్ ఎట్ సైట్ ఆర్డ‌ర్లు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో, ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌జాప్ర‌తినిధులు క‌నిపించ‌క‌పోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.

 

జీహెచ్ఎంసీ కార్పోరేట‌ర్లు రేప‌టి నుంచి వారి ప‌రిధిలో లాక్‌డౌన్ స‌క్ర‌మంగా అమ‌లయ్యేలా చూడాల‌ని అన్నారు. అలాగే ఎమ్మెల్యేలు త‌మ‌త‌మ ప‌రిధిల్లో ప‌ర్యవేక్ష‌ణ చేయాల‌ని సూచించారు. గ్రామాల్లో స‌ర్పంచులే క‌థానాయ‌కుల‌ని, గ్రామ‌స్థుల‌ను చైత‌న్య‌వంతం చేస్తూ క‌రోనా వ్యాప్తి జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. పోలీసులు, రెవెన్యూ, శానిశేష‌న్ సిబ్బంది మాత్ర‌మే క‌ష్ట‌ప‌డితే క‌రోనా అదుపులోకి రాద‌ని, అన్నిశాఖ‌లు, అధికారులు, ప్ర‌జాప‌తినిధులు, ప్ర‌జ‌లు సంయుక్తంగా కరోనా వ్యాప్తిని ఎదుర్కొవాల‌ని పిలుపునిచ్చారు. నిత్య‌వ‌స‌రాల వ‌స్తువుల‌కు సంబంధించి ఎలాంటి కొర‌త ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: