క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్‌డౌన్ మార్చి 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగనుంది. అయితే.. లాక్‌డౌన్ మొద‌టి రోజు అటు హైద‌రాబాద్‌తోపాటు ప‌లు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో ప్ర‌జలు రోడ్ల‌మీద‌కు వ‌చ్చారు. లాక్‌డౌన్‌ను పెద్ద‌గా పాటించలేదు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధికారుల‌తో అత్య‌వ‌స‌ర‌ అత్యున్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ పాటించ‌కుండా విచ్చ‌లవిడిగా వ్య‌వ‌హ‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. అవ‌స‌ర‌మైతే సైన్యం స‌హాయం తీసుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. అప్ప‌టికీ ప‌రిస్థితులు అదుపులోకి రాకుంటే షూట్ ఎట్ సైట్ ఆర్డ‌ర్ ఇచ్చేందుకు కూడా వెనుకాడ‌బోమ‌ని, ద‌య‌చేసి ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని, ఆ ప‌రిస్థితులు రానివ్వొద్ద‌ని సీఎం కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల అత్య‌వ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌ను పెంచుతున్న వ్యాపారుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

 

అవ‌స‌ర‌మైతే వ్యాపారుల‌పై పీడీయాక్టు న‌మోదు చేసి జైలుకు పంపిస్తామ‌ని సీఎం కేసీఆర్ హెచ్చ‌రించారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ప్ర‌జ‌లంద‌రూ సంఘ‌టితంగా స‌హ‌క‌రించాల‌ని సీఎం కేసీఆర్ కోరారు. అలాగే.. సీఎం కేసీఆర్ మ‌రికొన్ని కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేశారు. రోడ్ల‌పై పోలీసులు, మున్సిప‌ల్‌, పంచాయ‌తీరాజ్ అధికారులే క‌నిపిస్తున్నార‌ని, ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రాకుండా చూడ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌జాప్ర‌తినిధులు కూడా బాధ్య‌త‌గా ముందుకు వ‌చ్చి అధికారులకు స‌హ‌కరించాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు కూడా అవ‌స‌ర‌మైతే లాఠీ ప‌ట్టుకుని రోడ్ల‌మీద‌కు రావాల‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆయ‌న సూచించారు. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉండాల‌ని, ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ఉండాల‌ని ఆయ‌న ఆదేశించారు. ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా డ‌య‌ల్ 100 సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని, పోలీసులు సాయం అందిస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా, మీడియా కార్య‌క‌లాపాల‌కు ఆటంకం క‌లిగించ‌వ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: