కరోనా వైరస్. ఎంతటి మహమ్మారి. అసలు దయ లేదుగా. ఒకపుడు అలెగ్జాండర్ దేశాలను దాటుకుంటూ యుధ్ధం చేస్తూ గెలిచాడని విన్నాం. ఇపుడు ఏకంగా ప్రపంచ భయంకరి కరోనా తన దారుణమైన పద ఘట్టనలలో సమస్త లోకాలనే  అల్లల్లాడిస్తోంది. కరోనా పేరు అంటేనే జడుపు జ్వరం తెప్పిస్తోంది.

 

ఈ సమయంలో మన దగ్గర ఏమీ వేరే ఆయుధం లేదని ప్రధాని మోడీ తేల్చేశారు. మన దగ్గర ఎటువంటి ఆధునిక సంపత్తి, ఆసుపత్రులు, నిధులు, సదుపాయాలు కూడా లేవని క్లారిటీగా చెప్పేశారు. అందుకే లక్ష్మణ రేఖను ఆయన దేశ ప్రజలకు  విధించారు. ఇక కరోనా వైరస్  ని ఎదుర్కొనేందుకు అసలైన యుధ్ధం మొదలైపోయింది. అదే ఎవరి ఇంట్లో వారు గమ్మున కూర్చోవడమే.

 

ఒక దేశ ప్రధాని ఇంతలా బట్ట విడిచినట్లుగా చెప్పేశాక కూడా ఇంకా బయట తిరిగే సాహసం చేస్తే కోరి కరోనాను వెంటబెట్టుకున్నట్లే అవుతుంది. కరోనాని రారమ్మని పిలిచినట్లే అవుతుంది. మొదటి సారి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసినపుడే ప్రధాని తన ఆలోచన ఏంటో చెప్పేశారు.

 

సామాజిక దూరం ఒక్కటే మనకు తారకమంత్రమని కూడా స్పష్టంగా చెప్పేశారు. అయినా కరోనా విషయంలో జనంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. అది ఎక్కడో ఎవరొకో వస్తుంది. మన దగ్గరకు రాదులేనని జనం అమాయకత్వమో మూర్ఖత్వమో అలా ఉంటూ బయట హాయిగా విహారం చేస్తున్నారు. లాక్ డౌన్ అంటే కూడా బెరుకు పడడంలేదు. దాంతో ప్రధాని మరో మారు రంగంలోకి దిగాల్సివచ్చింది.

 

ఇపుడు కూడా ఆయన ఒక్క మాటే చెప్పారు. మన దగ్గర ఏమీ లేదు, కరోనా వచ్చాక ఏడ్చినట్లైతే అసలు సుఖం లేదని కూడా కుండబద్దలు కొట్టారు. అందుకే మడి కట్టుకుని ఇంట్లో కూర్చోండి అంటూ కాస్తా గట్టిగానే ఆర్డర్  వేశారు. ఇది దాటితే ఇంక కఠినంగానే ఉంటామని కూడా చెప్పేశారు. అంటే కరోనాని ఎదిరించేందుకు ప్రజలే ఇక చాలా  చేయాల్సింది ఉంది. 

 

మనం ఏమీ కత్తులు కటార్లు పట్టనవసరం లేదు. ఓపికగా ఇంట్లో ఉంటే చాలు. కరోనా తనదారి తాను పోయేంతవరకూ ఇంట్లో నుంచి ఎవరూ కదలరాదు. ఇది తప్పితే ఇంక ప్రజలను ఎవరూ కాపాడలేరు. ఇదే నిజం. ఇది పచ్చి నిజం. పాలకుడైన మోడీ అంతలా చెప్పాక ఇంక వినాల్సిందే. అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: