కేసీఆర్‌.. ఆయ‌న నిర్ణ‌యాలు ఎంత మొండిగా, మ‌రెంత‌ అనూహ్యంగా ఉంటాయో అంద‌రికీ తెలుసు..! తాను న‌మ్మిన ప‌ని కోసం.. దానిని విజ‌య‌వంతం చేసేందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్తారు.  ప్ర‌జాహితం కోసం ఎంత‌టి సంక్లిష్ట‌ప‌రిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకుత‌గ్గ‌ట్టే క‌ఠిన నిర్ణ‌యాలూ తీసుకుంటారు. మ‌రెంత ప్ర‌తికూల ప‌రిస్థితుల‌పైనా స‌రైన దిశ‌లో అంచ‌నా వేయ‌డం, వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌డంలో ఆయ‌నది ప్ర‌త్యేక‌మైన పంథా..! ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు దేశం మొత్తాన్ని ఆలోచింప‌జేస్తున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు అన్నివైపుల నుంచి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈక్ర‌మంలోనే జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించిన‌ మ‌రునాటి నుంచి తెలంగాణ వ్యాఫ్తంగా లాక్‌డౌన్ విధించారు. ప్ర‌జ‌లంద‌రూ త‌మ‌త‌మ ఇళ్ల‌లో ఉండి క‌రోనా క‌ట్ట‌డికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఒక‌ద‌శ‌లో చేతులెత్తి దండం కూడా పెట్టారు. అయితే.. లాక్‌డౌన్ మొద‌టి రోజు అటు హైద‌రాబాద్‌తోపాటు ప‌లు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌జ‌లు పెద్ద‌గా పాటించలేదు. ఎక్కువ‌గా బైకులు, కార్లు, ఇత‌ర వాహ‌నాల‌తో జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చారు. 

 

ఇక ఇక్క‌డే సీఎం కేసీఆర్‌కు చిర్రెత్తుకొచ్చింది. క‌రోనా వైర‌స్‌తో పొంచి ఉన్న ప్ర‌మాదాన్ని ప‌ట్టించుకోకుండా.. ప‌లువురు ఇలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు.ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి అత్య‌వ‌స‌ర అత్యున్న‌త‌స్థాయి స‌మాశం ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌ల‌కు చాలా సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చారు. లాక్‌డౌన్‌కు పాటించ‌కుండా ఎవ‌రైనా రోడ్ల‌మీద‌కు వ‌చ్చి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే.. అవ‌స‌ర‌మైతే సైన్యం సాయం తీసుకుంటామ‌ని, ఇదే స‌మ‌యంలో షూట్ ఎట్ సైట్ ఆర్డ‌ర్ ఇచ్చేందుకు కూడా వెనుకాడ‌బోమ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌జ‌లు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రించాల‌ని, ఇది మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు విధించుకున్న లాక్‌డౌన్ అని చెప్పారు. అయితే.. సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌లపై తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అమ్మో.. సీంఎ కేసీఆర్ అన్నంత ప‌ని చేసినా చేస్తారేమో.. అంటూ చ‌ర్చించుకుంటున్నారు. తొంభైశాతం మంది ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంద‌నుకుంటే చెడ‌గొట్టే ఒక్క‌శాతం జ‌నం కోసం ఆయ‌న ఆలోచించ‌ర‌ని.. వైర‌స్ ఎంత ప్ర‌మాద‌కారిగా మారిందో ఆయ‌న వార్నింగ్‌ను బ‌ట్టి మ‌నం కూడా అర్థం చేసుకోవాల‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: