దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 519కు చేరింది. ప్రధాని మోదీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో మూడు వారాల పాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. దేశంలో ప్రస్తుతం ఎన్నారైలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఒకప్పుడు విదేశాల నుంచి గ్రామానికి ఎన్నారై వచ్చాడంటే అతన్ని ఎంతో గర్వంగా చూసేవారు. 


 
అతన్ని పలకరించటం, సెల్ఫీలు తీసుకోవడం, విదేశానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం జరిగేది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ గ్రామంలొనైనా, పట్టణంలోనైనా ఎన్నారై వచ్చాడంటే ప్రజలు ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్లటం లేదు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా పల్లెల్లో కూడా ఎన్నారైల విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎన్నారై అని తెలిస్తే సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. 


 
ఎన్నారైలు మన దేశానికి వస్తే మొదట వారిలో కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో చెక్ చేస్తున్నారు. లక్షణాలు ఉంటే వారి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపుతున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ అని తేలితే వారు ఏఏ ప్రాంతాలకు తిరిగారో, ఎవరెవరిని కలిశారో వారి వివరాలను సేకరించి వారి విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో విదేశాల నుంచి వచ్చిన వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 


 
ఎన్నారైలు దేశంలోకి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోకి రావాలన్నా సరైన సౌకర్యాలు లేవు. ఒకవేళ వచ్చినా వారు క్వారంటైన్ కు పరిమితమవుతున్నారు. వ్యాధి లక్షణాలు లేకపోతే 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దేశంలో ఎన్నారైలు భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: