ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ట్వీట్ లో " ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను " అని పేర్కొన్నారు. 
 
ట్విట్టర్ వేదికగా మోదీ వివిధ భాషల్లో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నెటిజన్లు మోదీకి కామెంట్ల రూపంలో ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం రెండు తెలుగురాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజున సందడి నెలకొనేది. ఈ సంవత్సరం కరోనా ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రాష్ట్రంలో పండుగ సందడి కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 
 
ప్రధాని మోదీ నిన్న రాత్రి దేశప్రజలను ఉద్దేశించి దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఇంటికే పరిమితమై కరోనా కట్టడికి తమ వంతుగా సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 
 
మరోవైపు ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటించడంతో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, మెడికల్, ఆస్పత్రులు, అత్యవసర సర్వీసులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసింది. పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: